రిలీజ్ కు ముందు గట్టిగా ప్రచారం చేయాలనుకున్నాడు. దేశమంతా చుట్టేసే ప్లాన్ వేశాడు. అలా చేసినప్పుడు మాత్రమే స్పై సినిమాకు బజ్ వస్తుందని నమ్మాడు. కానీ నిర్మాత ససేమిరా అన్నాడు. చేసేదేం లేక చాలా తక్కువ టైమ్ లో, నామ్ కే వాస్తే ప్రమోషన్ కానిచ్చాడు నిఖిల్. ప్రారంభం నుంచి అతడు ఏదైతే భయపడ్డాడో అదే జరిగింది.
కార్తికేయ-2 సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనుకున్న నితిన్ ఆశలకు గండిపడింది. అరకొర ప్రచారంతో బరిలో దిగిన స్పై సినిమా బాక్సాఫీస్ బరిలో కిందామీద పడుతోంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇక కోలుకోవడం కష్టమని తేలిపోయింది.
విడుదలైన మొదటి రోజే స్పై సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ జానర్ లో వచ్చిన సినిమాల రేంజ్ లో ఈ మూవీ లేదని, మరీ ముఖ్యంగా నేతాజీ ఎలిమెంట్ ను ప్రమోషన్ లో వాడుకున్నంత గట్టిగా, కంటెంట్ లో వాడుకోలేకపోయారనే అపవాదు ఎదుర్కొంది. ఆ టాక్ అలానే కంటిన్యూ అవ్వడంతో నిఖిల్ సినిమా కోలుకోలేకపోయింది.
నిఖిల్ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. కానీ కథ-కథనం దారుణంగా ఉంటే అతడేం చేస్తాడు? సినిమాలో కొత్తదనం లేకపోవడమే ప్రధాన లోపంగా మారింది. ప్రస్తుతానికి డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా నష్టాలు మిగిల్చింది.
అటు ఓవర్సీస్ లో కూడా సినిమా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 3 లక్షల డాలర్లకు కాస్త ఎక్కువగా వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా గత వారాంతం విడుదలైన చిత్రాల్లో శ్రీవిష్ణు నటించిన సామజవరగమన చిత్రానిదే పైచేయి.