ఇటీవల తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్టుగానే, ఆ 18 మంది ఎమ్మెల్యేలకు క్లాస్‌లు తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ దఫా ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని, నిత్యం ప్రజల్లో వుండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ హితబోధ చేసిన సంగతి తెలిసిందే. సర్వే నివేదికల్లో నెగెటివ్ వస్తే, తాను చేయగలిగేదేమీ లేదని, కావున ముందే అప్రమత్తం కావాలని కోరారు.
నెగెటివిటీ ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల గురించి పేర్లు బయటికి చెప్పనని, వారిని పిలిపించుకుని మాట్లాడ్తానని జగన్ చెప్పినట్టుగానే, ప్రస్తుతం చేస్తున్నారు. మొదటి విడతలో ఐదుగురు ఎమ్మెల్యేలను జగన్ పిలిపించుకుని గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం. అసలు జనంలో తిరగడం లేదని, ఇలాగే నెగెటివ్ కొనసాగితే టికెట్ ఇవ్వలేనని, పద్ధతి మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
జగన్ పిలిపించుకుని మాట్లాడిన వారిలో పోలవరం, జగ్గంపేట, జగ్గయ్యపేట, పొన్నూరు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, జ్యోతుల చంటిబాబు, సామినేని ఉదయ్‌భాను, కిలారి రోశయ్య, అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలను పట్టించుకోకుండా అసలే మాత్రం జనం వద్దకు వెళ్లలేదని నివేదికలు వెళ్లాయి.
మరోవైపు ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు వివిధ సర్వే నివేదికల ద్వారా జగన్‌కు సమాచారం అందింది. దీంతో వారిని పిలిపించుకుని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై జగన్ కసరత్తు మొదలు పెట్టారు.