ఆదిపురుష్ లైన్లో ఉన్న కారణంగా ఇన్నాళ్లూ సలార్ అప్ డేట్స్ ఇవ్వలేదు మేకర్స్. ఇప్పుడు ఆదిపురుష్ థియేటర్లలోకి వచ్చి చాలో రోజులైంది. దాని రిజల్ట్ ఏంటనేది కూడా అందరికీ తెలిసిందే. దీంతో సలార్ యూనిట్ అప్ డేట్స్ తో సిద్ధమైంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ కు డేట్ లాక్ చేసింది.
సలార్ టీజర్ ను జులై 6వ తేదీన ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఇలా ఓ స్టార్ హీరో సినిమా టీజర్ ను పొద్దున్నే రిలీజ్ చేయడం అరుదుగా జరుగుతుంది. సాధారణంగా సాయంత్రం లేదా రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత రిలీజ్ చేస్తుంటారు. కానీ సలార్ టీజర్ ను మాత్రం ముహూర్తం ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తున్నారట.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ను మరోసారి నిలబెట్టే సినిమా ఇదేనంటూ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. వరల్డ్ వైడ్ సూపర్ హిట్టయిన కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ సలార్.
ప్రభాస్ ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా యాక్షన్ లుక్ నే బయటపెట్టారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది సలార్.