‘దేశం’-‘సేన’ పొత్తు ఫిక్స్!

సినిమా రంగంలో ఓ చిత్రమైన సంగతి వుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్..ఓ హీరోయిన్ లేదా ఓ టెక్నీషియన్ విషయంలో హీరో ముందే డిసైడ్ అయిపోయి వుంటారు. నిర్మాత లేదా దర్శకుడు ఏవేవో ఆప్షన్లు చెబుతుంటారు. తనకు…

సినిమా రంగంలో ఓ చిత్రమైన సంగతి వుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్..ఓ హీరోయిన్ లేదా ఓ టెక్నీషియన్ విషయంలో హీరో ముందే డిసైడ్ అయిపోయి వుంటారు. నిర్మాత లేదా దర్శకుడు ఏవేవో ఆప్షన్లు చెబుతుంటారు. తనకు కావాల్సిన పేరు వచ్చే వరకు హీరో వెయిట్ చేసి, ఆ పేరు వచ్చాక.. సరే కానివ్వండి అంటారు. అక్కడికి ఏదో వాళ్ల ఛాయిస్ నే తాను ఆమోదించినట్లు. 

ఇప్పుడు తెలుగుదేశం-జనసేన నడుమ ఇలాంటి కార్యక్రమమే నడుస్తోంది. తెలుగుదేశం-జనసేన కలిసి వెళ్లడం ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఆ విషయం బయట పెట్టలేదు. తెలుగుదేశం ఇన్ సైడ్ వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఢంకా భజాయించి చెబుతున్నాయి. విడిగా వెళ్లే ప్రశ్నే లేదు. కలిసే వెళ్తాం అంటూ ధీమాగా చెబుతున్నారు.

కానీ జనసేన అభిమానులు మా పవన్ బాబే సిఎమ్ అంటున్నారు. పవన్ కూడా తనను సిఎమ్ ను చేయండి అంటున్నారు. ఈస్ట్..వెస్ట్ మొత్తం స్వీప్ చేస్తాం అనే లెక్కలో మాట్లాడుతున్నారు. కానీ పొత్తు వుంటే ఇవన్నీ ఎలా సాధ్యం అన్నది చెప్పడం లేదు. అందుకే అసలు పొత్తు మాటే మాట్లాడడం లేదు. కానీ వైకాపాను టార్గెట్ చేస్తున్నారు తప్ప, 2014 నుంచి 2019 వరకు పాలించిన తెలుగుదేశం సాధించిందో, సాధించనిదో అస్సలు వాటి గురించి మాట్లాడడం లేదు. తెలుగుదేశం నాయకుల గురించిన ప్రస్తావనే లేదు.

ద్వారంపూడి, సుబ్బారెడ్డి, పెద్ది రెడ్డి, చెవిరెడ్డి, ఇలా ఈస్ట్..వెస్ట్ మొత్తం రెడ్లను తిట్లడంతో సరిపోయింది తప్ప మరో కులానికి చెందిన వారిని పల్లెత్తు మాట అనలేదు. దీనిని బట్టే తెలుస్తోంది. ఈస్ట్..వెస్ట్ లో వైకాపాను అస్సలు గెలవనివ్వకూడదని అనుకోవడం, రెడ్లను టార్గెట్ చేయడం ఇవన్నీ కలిసి తెర వెనుక వ్యవహారాలకు అద్దం పడుతున్నాయి.

అంతే కాదు అన్నవరం నుంచి కత్తిపూడి మీదుగా కాకినాడ వరకు చేసిన ప్రసంగాల్లో తన పార్టీని గెలిపించాలని, తనను సిఎమ్ ను చేయాలని, అలా సిఎమ్ చేస్తే ఇది చేస్తా.. అది చేస్తా అంటూ చెప్పిన పవన్ ఆ తరువాత చాలా కన్వీనియెంట్ గా మాట మార్చేసారు. అసలు ఎన్ని చోట్ల పోటీ చేస్తారో చెప్పకుండా సిఎమ్ ఎలా చేయమంటావు అంటే మీడియా, సోషల్ మీడియా ఓ లెక్కలో విమర్శలు కురిపించడంతో మాట మార్చేసారు.

మొత్తం పర్యటనలో వైకాపాను తిట్టడం మినహా మరో పని పెట్టుకోలేదు.  నిజంగా తాను సింగిల్ గా పోటీ చేసే అవకాశం వుంటే కనీసం రెండు జిల్లాల్లో ఒకరిద్దరు అభ్యర్ధులైనా ఖరారు చేసి వుండే వారు. అదీ చేయలేదు. తన మేనిఫెస్టో ఎలాగూ లేదు. కేవలం వైకాపాను, రెడ్డి సామాజిక వర్గాన్ని తిట్టడం మినహా మరో అజెండానే లేదు.

ఇవన్నీ కేవలం వైకాపాను గద్దె దింపి తేదేపాను అధికారంలోకి తేవడం కోసం తప్ప మరోటి కాదని తెలుస్తూనే వుంది. అది గమనించే తెలుగుదేశం జనాలు కూడా పొత్తు పక్కా అని చెబుతూ వుండి వుండవచ్చు.

కానీ ఒకటే ఇంత మంది జనం, ఇంత హడావుడి చేసిన పవన్.. రేపు పొత్తు పక్కా అని ఇరవై సీట్లతో సరిపెట్టుకుంటే జనసైనికుల పరిస్థితి ఎలా వుంటుందో మరి?