కేసీఆర్ ఒక్కరే ఉన్నారు! ఆయన ఒక బూచి అని, విలన్ అని.. ప్రజలను నమ్మించడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు తపన పడుతున్నారు. ఒకసారి ‘కేసీఆర్ బూచి’ అని నమ్మిస్తే.. ఆ తర్వాత.. బూచితో లోపాయికారీ పొత్తు పెట్టుకున్నారనే.. మరొక రాజకీయ ప్రత్యర్థిని కూడా బద్నాం చేయవచ్చుననేది వారి వ్యూహం. భారాస ప్రత్యర్థులు బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా త్రిముఖపోరు కనిపిస్తోంది. ఇక్కడ తమాషా ఏంటంటే- ప్రతి పార్టీ కూడా మిగిలిన రెండు పార్టీలను స్నేహితులుగా ముడిపెట్టి విమర్శలు చేస్తోంది. మేము తప్ప మిగిలిన ఇద్దరూ పరిపాలనకు పనికిరారు అని చెప్పడం వరకు.. త్రిముఖ పోటీలో సర్వసాధారణంగా జరిగే సంగతి. అయితే, ‘నేను తప్ప మిగిలిన ఇద్దరూ లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకుని, మమ్మల్ని ఓడించడానికి కుట్ర చేస్తున్నారు’ అనే ప్రచారంతో ముందుకు సాగడం ఇక్కడ మూడు పార్టీలకు అలవాటుగా మారింది.
భారతీయ జనతా పార్టీ- భారత రాష్ట్ర సమితి మధ్య అపవిత్రమైన అప్రకటిత లోపాయికారి పొత్తు ఉన్నదని కాంగ్రెస్ తొలి నుంచి ఆరోపిస్తూనే ఉంది. మోడీ వ్యూహం మేరకే కల్వకుంట్ల చంద్రశేఖర రావు పావులు కదుపుతున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ.
జాతీయస్థాయిలో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించటానికి ఏర్పాటు అయిన విపక్ష కూటమిలోకి భారాస ను రానివ్వబోయేది లేదని, కూటమిలోకి కేసీఆర్ ను ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి దూరంగా ఉంటుందని, తాము ముందే హెచ్చరించామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా ఖమ్మం సభలో కూడా ప్రకటించారు. ఈ మాటల ద్వారా కేసీఆర్ పట్ల తమకు ఉండే ఇతర ద్వేషాలు, వైషమ్యాలను దాచిపెట్టి కేవలం బిజెపితో లోపాయికారి పొత్తు వలన మాత్రమే కెసిఆర్ ను వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
అదే సమయంలో, టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయి అంటూ బిజెపి కూడా ఆరోపిస్తూన్నది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావే ఫైనలైజ్ చేస్తారని, ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారని బిజెపి ఆరోపిస్తోంది.
బిజెపి- కాంగ్రెస్ రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. ఆ ఇద్దరూ తమను ఓడించడానికే అక్రమసంబంధం పెట్టుకున్నారనే మాట మాత్రం భారాస నుంచి రావడం లేదు. నిజానికి ఈ అపవిత్ర పొత్తుల గురించి బజెపి, కాంగ్రెస్ పార్టీలు భారాస మీద వేసే నిందలే ఒక కామెడీ అయితే.. ఆ రెండింటికి ముడిపెట్టి తాము నిందలేస్తే ఇంకా వీర కామెడీ అవుతుందని వారు అనుకున్నట్టుంది.
కాకపోతే.. వారిద్దరూ ఒకే తానుముక్కలు అని భారాస విమర్శిస్తూ ఉంటుంది. ఈ తరహాలో ఇద్దరిద్దరికి ముడిపెట్టే తీరుతో తెలంగాణలో కామెడీ రాజకీయాలు నడుస్తున్నాయి.