అవినాష్ బెయిల్‌పై నేడు కీల‌క విచార‌ణ‌

ఇవాళ సుప్రీంకోర్టులో వివేకా హ‌త్య కేసుకు సంబంధించి రెండు కీల‌క విచార‌ణ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌టి క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై, రెండోది అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని వివేకా…

ఇవాళ సుప్రీంకోర్టులో వివేకా హ‌త్య కేసుకు సంబంధించి రెండు కీల‌క విచార‌ణ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒక‌టి క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై, రెండోది అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచారించ‌నుంది. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ వివేకా త‌న‌య డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇటీవ‌ల త‌నే సుప్రీంకోర్టులో వాద‌న‌లు వినిపించ‌డానికి ముందుకొచ్చారు. ఈ కేసులో సీబీఐని కూడా ఇంప్లీడ్ కావాల‌ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆమె కోరారు. అలా తామెట్లా చెబుతామ‌ని సుప్రీంకోర్టు అభ్యంత‌రం తెలిపింది. వివేకా హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ గ‌డువు గ‌త నెలాఖ‌రుతో ముగిసింది.

మ‌రోవైపు క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయించాల‌నే డాక్ట‌ర్ సునీత ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు. మ‌రోవైపు జూలై 3కు అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను వాయిదా వేయ‌డం డాక్ట‌ర్ సునీత జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇవాళ విచార‌ణ‌కు వ‌స్తోంది. సుప్రీంకోర్టు స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది.

ఎప్ప‌ట్లాగే అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు ర‌ద్దు చేస్తుంద‌ని, వెంట‌నే సీబీఐ అరెస్ట్ చేస్తుంద‌ని ఎల్లో మీడియా త‌న‌దైన రీతిలో కథ‌నాల‌ను వండివార్చుతోంది. అలాగే దస్త‌గిరి విష‌యంలో సుప్రీంకోర్టు నిర్ణ‌యం ఎలా వుంటుందోన‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. సుప్రీంకోర్టు తీర్పులు వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుండ‌డంతో అంద‌రి దృష్టి అటువైపే వుంది.