కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేరికపై వైఎస్సార్ ఆత్మ, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరిక వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక షర్మిలే అంతిమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. షర్మిల చేరికపై కేవీపీ అన్న మాటలు చర్చనీయాంశమయ్యాయి.
తెలుగు రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావు మధ్య స్నేహానికి ప్రత్యేక గుర్తింపు వుంది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరి నేతల మధ్య దాపరికాలేవీ వుండవు. కేవీపీని తన ఆత్మగా వైఎస్సార్ అనేక సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్‌కు ఆయన కుటుంబం దూరమైంది. కానీ కాంగ్రెస్‌లో కేవీపీ కొనసాగుతున్నారు. ఖమ్మం సభలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్‌గాంధీకి స్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు వెళ్లారు.
ఈ సందర్భంగా కేవీపీ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేరికపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై తనకు సమాచారం వుందని కేవీపీ రామచంద్రరావు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ వాదిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్ల కాంగ్రెస్ నష్టపోయిందన్నారు.
షర్మిల చేరికపై కేవీపీ మనసులో మాట చెప్పడంతో దాదాపుగా ఆమె జాయిన్ కావడం ఖరారైనట్టే అనే చర్చ జరుగుతోంది. అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడానికి మాత్రమే అంగీకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.