అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు సోమవారం తెల్లవారుజామున ఉత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పోలీస్‌శాఖకు షాక్ ఇచ్చింది. తాడిపత్రిలో నంద్యాల రోడ్డులో నివాసం వుంటున్న ఆయన ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించినట్టు సమాచారం. కుటుంబ సమస్యలే ఆయన ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
కర్నూలు జిల్లాకు చెందిన ఆయన 1998లో సీఐగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ కావాల్సిన ఆయన అర్ధంతరంగా ప్రాణాలు తీసుకున్నారని ఆనందరావు మిత్రులు వాపోతున్నారు. గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్టు తమ వద్ద చెప్పేవాడని మిత్రులు చెబుతున్నారు.
అయితే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతారని ఎవరూ అనుకోలేదని అంటున్నారు. ఇంట్లో ఉరికి వేలాడుతున్న సీఐని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఆనందరావు మృతిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఘటనా స్థలాన్ని అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆనందరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.