రసకందాయంలో రాజకీయం కేసీఆర్ కు చెక్ !

తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడేమీ అన్ని రాజకీయ పార్టీలు- అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరకంగా జట్టుకట్టడం లేదు. ‘వ్యతిరేక ఓటు చీలరాదు’ అనే శుష్కనినాదంతో అనైతిక పొత్తులకు, స్వార్థపూరిత స్నేహబంధాలకు దిగజారడం లేదు.…

తెలంగాణ రాజకీయం రసకందాయంలో పడింది. ఇక్కడేమీ అన్ని రాజకీయ పార్టీలు- అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరకంగా జట్టుకట్టడం లేదు. ‘వ్యతిరేక ఓటు చీలరాదు’ అనే శుష్కనినాదంతో అనైతిక పొత్తులకు, స్వార్థపూరిత స్నేహబంధాలకు దిగజారడం లేదు. తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడం మీదనే దృష్టి పెడుతున్నారు. కానీ కేసీఆర్ కు చెక్ పెట్టిన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. 

శతాయుః సర్కారు తమది అని, శతాధిక సీట్లు దక్కుతాయని గులాబీ వాక్కులు ధీమా వ్యక్తం చేస్తుండవచ్చు గాక.. కానీ తెలంగాణ రాజకీయ వాతావరణం వారికి అంత సానుకూలంగా లేదు. తెలంగాణ పరిణామాల్లో ఏపీ పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. దేశమంతా నేర్వవలసిన పాఠాలు కొన్ని కనిపిస్తున్నాయి. 

ఎర్రకోట మీద గులాబీ జెండా రెపరెపలాడిస్తానని ప్రతిజ్ఞచేసిన కేసీఆర్ కు, గోలుకొండ కోట మీద రెపరెపలాడించే అవకాశం మళ్లీ దక్కుతుందా? అనేదే సందేహాస్పదం అవుతున్న వైనమే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘కేసీఆర్‌కు చెక్!’

గులాబీ లక్ష్యాలు ఇప్పుడు సరికొత్తవి. గులాబీ– ఇప్పుడు దేశమంతా పరిమళించాలని అనుకుంటున్నది. 

తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గులాబీదళాలకు కేవలం ఒక నమూనాలాగా కనిపిస్తోంది. తెలంగాణలో మేం ఇంత అద్భుతంగా చేశాం.. అంతే అద్భుతాలను యావద్దేశంలో  సృష్టించబోతున్నాం… అని చాటడం ద్వారా, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలందరినీ ఊరించవచ్చునని కేసీఆర్ అనుకుంటున్నారు. 

ఒకప్పుడు మోడీ అనుసరించిన వ్యూహచాతుర్యాన్నే ఆయన కూడా అనుసరించాలని అనుకుంటున్నట్టుగా ఉంది. 2014లో ప్రధాని కావడానికి ముందు నరేంద్రమోడీ అనుసరించిన మార్గం ఇదే. అప్పటికి గుజరాత్ మీద ఎన్ని రకాల ప్రచారాలున్నా, మోడీ పాలన గురించి ఎన్ని విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నా.. మోడీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. ‘వైబ్రంట్ గుజరాత్’ అంటూ.. దేశవ్యాప్తంగా ఒక ముమ్మరమైన ప్రచారాన్ని హోరెత్తించారు. గుజరాత్ లో అద్భుతాలేవో జరిగిపోతున్నాయి.. అని దేశం మొత్తం ప్రజలు నమ్మేలా ఊదరగొట్టించారు. ఆ పాచిక పనిచేసింది.

ఇప్పుడు కేసీఆర్ కూడా అదే మార్గంలో వెళ్లాలనుకుంటున్నారు. ఇక్కడ ఒక తేడా ఉంది. మోడీ పరోక్షంలో మోడీని హీరోగా ప్రొజెక్టు చేస్తూ అప్పట్లో గుజరాత్ ప్రగతిని గురించిన ప్రచారం దేశమంతా సాగిపోయింది. ఆ ప్రగతిని నమ్ముతూ దానికి కర్తగా మోడీని ప్రజలు మెచ్చుకున్నారు. 

అది ఆయనను ప్రధానిని చేసింది. ఇప్పుడు పరిస్థితి వేరు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం.. ప్రధాని కావడం గురించి ఎన్నికలకు ఓ ఏడాది ముందు మాత్రమే మేల్కొన్నారు. అప్పటికైనా సజావుగా పనిచేసి ఉంటే.. తెలంగాణలో సాధించిన అభివృద్ధి అని ఆయన ఏదైదే అనుకుంటున్నారో దాన్ని గురించి ముందుగానే మిగిలిన రాష్ట్రాల్లోకి ప్రచారదళాలను పంపి ఉండాలి. ఇప్పటిదాకా ఆయన అడుగు పెట్టింది ఒక్క మహారాష్ట్రలో మాత్రమే కాగా.. అక్కడ  కూడా.. సభలు నిర్వహించినప్పుడు ఆయనే స్వయంగా తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. 

మోడీ- కేసీఆర్ వ్యూహాల్లో చిన్న వ్యత్యాసం ఉంది. మోడీ అడుగుపెట్టడానికి ముందే ఆయన గురించిన పొగడ్తలు బాగా వ్యాపించాయి. కేసీఆర్ తన గురించి తానే చెప్పుకుంటున్నారు. ఇది వింటున్న వారికి సొంత డబ్బాలాగా అనిపిస్తే, అందువలన.. వారు ఆయన ప్రయత్నం పట్ల సానుకూలంగా స్పందించకపోతే.. వారి తప్పు కాదు!

జాతీయ రాజకీయాల్లో ఇలాంటి విఫలవ్యూహంతో అడుగులు వేస్తున్న కేసీఆర్ సొంత రాష్ట్రం పరిస్థితి ఏమిటి? నేను తెలంగాణలో అద్భుతాలు చేశానని, తెలంగాణ మోడల్ అభివృద్ధిని ఇతర రాష్ట్రాలకు కూడా పరిచయం చేస్తానని కేసీఆర్ ఇతరులను నమ్మించాలని ప్రయత్నిస్తుండవచ్చు. కానీ.. ఇక్కడ ఆయన సొంత రాష్ట్రంలో సొంత ప్రజలు ఆయన చేసిన అభివృద్ధి పట్ల గౌరవంతో ఉన్నారా? ఆయన చెబుతున్న మాటలను నమ్మేస్థితిలో ఉన్నారా? ఆయన చెబుతున్న మాటలకు బ్రహ్మరథం పట్టి.. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ఉబలాటపడుతున్నారా? లేదా?

తెలంగాణలో సెంచరీకి ఒకటి తక్కువ 99 సీట్లు సాధిస్తాం అని, కాబోయే ముఖ్యమంత్రిగా సొంత పార్టీ ప్రముఖుల స్తోత్రాలు స్వీకరిస్తున్న కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో.. ఎంఐఎంకు 7 సీట్లు మినహాయిస్తే.. ఉన్నది 112 మాత్రమే. ప్రస్తుతం భారాసకు 103 సీట్లున్నాయి. అంటే నాలుగు సీట్లను కోల్పోవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారన్నమాట. అధికారంలోకి వచ్చి తీరుతాం అని అనుకుంటున్న బిజెపి, కాంగ్రెస్ లకు కలిపి ఆయన కేవలం 13 సీట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. అంచనాకోసం చెరిసగం అనుకుంటే ఆయన దృష్టిలో వీరికి దక్కేస్థానాలు ఎంఐఎంకంటె తక్కువ.

ప్రత్యర్థులను చాలా బలహీనులుగా అంచనా వేయడం మాత్రమే కాదు. ప్రత్యర్థుల పట్ల చాలా చులకన, తేలికభావంతో కూడిన మాటలు ఇవి. తెలంగాణ పౌరసమాజాన్ని మాయచేయడానికి ప్రత్యర్థుల బలం గురించి ఇలా చులకనగా మాట్లాడితే పరవాలేదు.. దానిని ఎన్నికల వ్యూహంగా అర్థం చేసుకోవచ్చు. కానీ.. వారి అంతరంగంలో కూడా అదే నిజమని నమ్ముతూ ఉంటే మాత్రం.. ఎదురుదెబ్బ తప్పదు! సాధారణంగా రణవ్యూహంలో.. ప్రత్యర్థిని గెలవగలం అనే నమ్మకాన్ని తన సేనలకు ఇవ్వాలి.

కానీ, ప్రత్యర్థిని బలవంతుడిగానే అంచనా వేయాలి! చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టే యుద్ధనీతినే అనుసరించాలి. కేటీఆర్ మనస్ఫూర్తిగా 99 సీట్ల సాధన గురించిన నమ్మకంతో ఉంటే మాత్రం.. ఆలోచించాల్సిందే. కేసీఆర్, కేటీఆర్ లు మళ్లీ అధికారం దక్కడం గురించి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం వేరు. ఆల్రెడీ కేసీఆర్ పాలనకు చెక్ పెట్టారు. ఆయన తర్వాతి ఎత్తు ఏం వేయబోతున్నారన్నదే తేలడం లేదు.

అనూహ్యంగా బలపడుతున్న కాంగ్రెస్!

కాంగ్రెస్ పార్టీ అంటేనే ముఠాతగాదాలకు చిరునామా. తెలంగాణ కాంగ్రెస్ అందుకు అతీతమైనది కాదు. ఈ పార్టీలో ఊరూపేరూ లేని నాయకులు, చెట్టు పేరు చెప్పుకోకుండా గుప్పెడు ఓట్లు సాధించగల నేతలు కూడా తమకంటూ ఒక గ్రూపు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర నాయకత్వం మీద ఎగిరెగిరిపడుతుండడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాతావరణం మారుతోంది. కడుపులో కత్తులు దాచుకుని ఉన్నారో ఏమో తెలియదు గానీ.. పైకి మాత్రం అంతా కలుస్తున్నారు. ఇది చాలా గొప్ప పరిణామం. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన బలాన్ని ఒక్కసారిగా సంతరించుకుంది. కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయి.

ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే.. అటు భారాస, ఇటు బిజెపిలోని అసంతృప్త నాయకులకు కాంగ్రెసు పార్టీ ఒక్కటే దిక్కుగా కనిపిస్తోంది. ఆ పార్టీలోనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అందరికీ నమ్మకం కలుగుతోంది. అధినాయకులు బుజ్జగించడానికి ప్రయత్నించిన భారాస నాయకులు కూడా కాంగ్రెసు వైపే చూస్తున్నారు. 

ఇటు కమలదళ సేనలు కూడా కాంగ్రెసును ఆశ్రయిస్తున్నాయి. చేరికల కమిటీ అంటూ ఫిరాయింపుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ సాధించినదేం లేదు గానీ, అలాంటి పేర్లు లేకుండా కాంగ్రెసు దూసుకెళ్తోంది. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు భారాసను వీడిన తర్వాత.. కొత్తగా తమ ప్రస్థానానికి కాంగ్రెస్ ను ఎంచుకోవడం అనేది వారికి చాలా పెద్ద ఎడ్వాంటేజీ! ఆ ఇద్దరికోసం బిజెపి నానా పాట్లు పడిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ వైపే మొగ్గడంతో.. ‘ఏది బెటర్’ అనే మీమాంసలో ఉన్న అనేకమంది ఆశావహులకు ఒక దారి దొరికినట్లు అయింది. వారి చేరిక ఖరారయ్యాక కాంగ్రెస్ ఇంకా స్పీడు పెంచింది.

ఆదివారం రాహుల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ సభ జరగనుంది. భట్టి విక్రమార్క పాదయాత్ర ఒకవైపు ప్రకంపనాలు సృష్టిస్తోంది. గ్రూపు రాజకీయాలు చాపకింద నీరులా పనిచేస్తున్నప్పటికీ.. రాహుల్ గాంధీ హెచ్చరికల నేపథ్యంలో అవన్నీ సద్దుమణుగుతాయని ఆశించవచ్చు. సాధారణంగా రాష్ట్ర స్థాయుల్లో గ్రూపులను ప్రోత్సహించే అలవాటు ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి భిన్నంగా వ్యవహరిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన అక్కడి పీసీసీ చీఫ్ డికె శివకుమార్ మార్గదర్శనం.. వీరికి లాభిస్తోంది. 

కేసీఆర్ మీద అందరు కాంగ్రెసు, బిజెపి నాయకులకంటె కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడే అలవాటున్న షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదికూడా నిజమైతే.. ఆ పార్టీకి మహోత్సాహం కలుగుతుంది. రెడ్డి సామాజికవర్గం మొత్తం ఏకపక్షంగా కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకుంటుందనడంలో సందేహం లేదు. అన్ని రకాలుగానూ.. కాంగ్రెస్ కు అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మీద కేసీఆర్ చేసే విమర్శలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ ఎంపిక చేస్తారని, ఎందుకంటే వారు గెలిచిన తర్వాత తన పార్టీలో కలుపుకుంటారని బిజెపి చేస్తున్న ప్రచారాలు ఫలితమివ్వకపోవచ్చు. కేసీఆర్ కు చెక్ పెట్టడంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ దే పైచేయిగా ఉంది. 

బిజెపి- స్లో అయినా సీరియస్సే..

మొన్న మొన్నటిదాకా కేసీఆర్ సర్కారు మీద తీవ్రస్థాయిలో ఎగిరెగిరి పడిన భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా స్లో అయిపోయింది. కాంగ్రెస్ వదిలించుకుంటున్న సంస్కృతిని వారు కొత్తగా తగిలించుకుంటూ ఉండడమే అందుకు కారణం. తెలంగాణ బిజెపి లో ముఠాతగాదాలు హద్దులు దాటుతున్నాయి. పాతనేతలకు, కొత్త నేతలకు మధ్య పొసగడం లేదు. ఇది ఎప్పుడూ ఉండేదే అయినా.. ఇప్పుడు అధికారం దక్కుతుందని అనుకుంటున్న వేళ.. వీరి కుమ్ములాటలు మరింతగా పెరిగాయి. అవి ఏకంగా పార్టీ దూకుడును కూడా మందగమనంగా మార్చేశాయి. అయినా సరే.. భారతీయజనతాపార్టీ భారాసకు ఎంతో కొంత నష్టం చేయకుండా ఉండదు.

గత ఎన్నికల్లో సాధించిన బలాబలాలతో పోల్చి చూస్తే బిజెపి పరిస్థితి చాలా చాలా మెరుగుపడిందని అనుకోవాలి. గత ఎన్నికల్లో కేవలం ఒక్కటే ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న పార్టీ, ఈ సారి ‘అధికారంలోకి వస్తాం’ అని ధీమాగా చెప్పగలుగుతున్నదంటేనే.. అది వారి బలానికి నిదర్శనం. కానీ.. ఏకపక్షంగా బిజెపి అధికారంలోకి వచ్చేయబోతున్నదా? అనేది చాలా మందిలో మెదలుతున్న సందేహం. అతి కష్టమ్మీద 20 నుంచి 30 సీట్ల వరకు గెలవగలరేమో అనేది పలువురి అంచనా. 

కేంద్రంలో అధికారంలో ఉన్నారు గనుక.. నిధులకు కొదవలేని పార్టీ గనుక.. రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా తిరుగుతూ.. అధికార పార్టీ మీద విరుచుకుపడుతూ హడావుడి చేయడంలో వారు ముందున్నారు. అంతమాత్రాన ఆ హడావుడి సీట్లను గెలిపిస్తుందనుకోవడం భ్రమ. ఉప ఎన్నికలు వచ్చిన ఒకటిరెండు చోట్ల సాధించిన విజయాలు.. పార్టీకి బలం అనుకోవడానికి లేదని, అవి కేవలం వాపు కాగల అవకాశం ఉందని నిరూపణ అయింది. మునుగోడు ఎన్నిక ఓడిపోవడం వారి బలహీనతకు పరాకాష్ట. అయినా సరే.. బిజెపి హడావుడి కొనసాగుతోంది.

బిజెపి నుంచి కూడా చాలా మంది కీలక నాయకులు, పదవుల్లో ఉన్న వారు కూడా.. కాంగ్రెస్ వైపు వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ పేరు ప్రబలంగా వినిపిస్తోంది. ఈటల ఆ అవకాశాన్ని తోసిపుచ్చారు గానీ.. మరికొందరు వెళ్లే చాన్సుంది. ఈ పరిణామాలు.. బిజెపికి ముందు అనుకున్నంత ఈజీగా అధికారం దక్కడానికి ఆటంకాలు అవుతాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గద్దె దింపడానికి మరింతగా దోహదం చేస్తాయి.

హ్యాట్రిక్ కొట్టాలనే కోరిక కేసీఆర్ కు ఉండొచ్చు. ఒకసారి హ్యాట్రిక్ సీఎం అనిపించుకుని.. ఆరునెలల తర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేసి.. హస్తినాపురి కేంద్రంగా శేషజీవితం గడపాలనే ఆలోచన, ఆశ ఉండొచ్చు. అయితే.. హ్యాట్రిక్ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు బంగారు పళ్లెంలో పెట్టి తనకు అందిస్తారనే అహంకారంతో ఉంటే.. దెబ్బతింటారు. ఆల్రెడీ ఆయనకు ప్రత్యర్థులు చెక్ పెట్టి ఉన్నారు… ఆయన వ్యూహాలు మార్చుకుంటూ.. కొత్త ఎత్తుగడలు ఆలోచిస్తే తప్ప మనుగడ కష్టం.

.. ఎల్. విజయలక్ష్మి