తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ముమ్మరంగా మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినదెల్లా మాట్లాడేస్తూ ఉండే ప్రముఖ నాయకుల్లో వర్ల రామయ్య ఒకరు. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున జప్తు చేయడానికి ప్రభుత్వం పూనుకున్నప్పుడు.. గగ్గోలు పెట్టిన పచ్చ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు.
తాజాగా ఆ నిర్మాణాన్ని జప్తు చేయడానికి ఏసీబీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఆ వ్యవహారం పూర్తిగా అక్రమం అయినప్పటికీ, దాని జప్తునకు ఆదేశించినది న్యాయస్థానమే అయినప్పటికీ.. వర్ల రామయ్య ఈ అవకాశాన్ని జగన్ ను నిందించడానికి వాడుకుంటున్నారు.
ఎంతగా అంటే.. చంద్రబాబునాయుడు చిల్లర బుద్ధులకు, అల్పత్వానికి నిదర్శనమైన అక్రమకట్టడంలో నివాసం గురించి.. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా తమ పార్టీ పరువు పోతుందనే స్పృహ ఆయనకు కలగడం లేదు. ప్రజలు నవ్వుకుంటారనే చింత రావడం లేదు.
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఇంటిని ఏసీబీ కోర్టు జప్తు చేస్తే దాంతో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం సంబంధం అని వర్ల రామయ్య అంటున్నారు. ఎందుకు సంబంధం ఉండదో ఆయనకే తెలియాలి. ఏ మాఫియా డాన్ లాంటి వ్యక్తి ఓ అందమైన ఇంటిని నిర్మించుకుంటే.. దాన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి అద్దెకు వాడుకుంటే అది తప్పు కాకుండా పోతుందా? పైగా అక్రమాలకు పరాకాష్ట అయిన నిర్మాణాన్ని కూల్చివేయాల్సిన ప్రభుత్వాధినేతే అద్దెకు తీసుకోవడం లాలూచీ అనిపించుకోదా? ఆ ఇంటి జప్తుకు కోర్టు ఆదేశాలిస్తే.. చంద్రబాబు వైఖరిని కాక మరెవ్వరిని తప్పుపట్టాలి అనేది ప్రజల ప్రశ్న.
కుప్పంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదని ఆడిపోసుకున్నారు. కుప్పంలో ఇల్లు కట్టుకోడానికి అనుమతులు ఇవ్వకుండా, ఉండవిల్లి ఇంటిని జప్తు చేసేసి.. చంద్రబాబును రోడ్డున పడేద్దామని అనుకుంటున్నారా? అని వర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూస్తున్న వ్యక్తి, అక్రమ కట్టడాన్ని.. తన నివాసంగా ఎంచుకున్నప్పుడే.. ఇలా రోడ్డున పడడం గురించి ఆలోచించి ఉండాల్సిందని ప్రజలు అంటున్నారు. అయినా అక్రమ కట్టడాన్ని జప్తు చేస్తే రోడ్డున పడేయడం ఎందుకు అవుతుంది? అనేది పలువురి సందేహం. ఎటూ అది చంద్రబాబు సొంత ఇల్లు కాదు. అద్దె ముసుగులో.. దాన్ని ఆల్రెడీ చంద్రబాబు కబ్జా చేసేసి ఉంటే గనుక చెప్పలేం.
చంద్రబాబును రోడ్డున పడేస్తారా? అని అడుగుతున్న వర్ల రామయ్య మాటలు ఎలా ఉన్నాయంటే.. లింగమనేని ఇల్లు జప్తు అయితే.. ఇక చంద్రబాబుకు అద్దె ఇల్లే దొరకదు, అంత గతిలేని స్థితిలో ఆయన ఉన్నారు. ఆయన మొహం చూసి ఏపీలో ఎవ్వరూ అద్దెకు ఇల్లు కూడా ఇవ్వరు.. పాపం మీరు ఉన్నదాన్ని జప్తు చేసేస్తే ఆయన ఏమైపోవాలి.. అని వర్ల రామయ్య చంద్రబాబు మీద సానుభూతి కురిపిస్తున్నట్టుగా ఉంది.