సిక్కోలు జిల్లాలో బాగా టీడీపీకి పట్టున్న చోటనే వైసీపీ మంత్రి ఒకరు తమ్ముళ్లకు చుక్కలు చూపిస్తున్నారా. ఉక్కిరిబిక్కిరి చేసి గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారా. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మీడియా సమావేశం పెట్టి వైసీపీ సర్కార్ మీద నిప్పులు చెరుగుతూంటే ఆ వైసీపీ మంత్రి నిర్వాకం గట్టిగానే ఉంది అనుకోవాల్సిందే.
పలాసాలో ఫస్ట్ టైం గెలిచి వెంటనే మంత్రి అయిన సీదరి అప్పలరాజు టోటల్ శ్రీకాకుళం జిల్లా టీడీపీకే కన్నెర్రగా మారారు. పలాసాలో గౌతు ఫ్యామిలీకి ఎదురొడ్డి నిలిచిన సీదరి ఇపుడు ఏకు మేకుగా మారి రెండవమారు గెలవడానికి అంతా రెడీ చేసుకుంటున్నారు.
సీదరి అప్పలరాజుకి ఏమి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని ఇంతకాలం ఆలోచించి లైట్ తీసుకున్న టీడీపీ హై కమాండ్ ఇపుడు గౌతు ఫ్యామిలీ ప్లేస్ లో కొత్త వారిని ఆలోచిస్తోంది అంటే సీదరి సీటు కి బాగానే అతుక్కుపోయారని అర్ధం. తాజాగా పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు సాగు నీటి కాలువ కప్పేసి అక్రమంగా కల్వర్టు నిర్మించుకున్నారని దాన్ని కూలగొట్టమని మంత్రి గారు ఆర్డర్ వేశారు.
ఆ అక్రమ కల్వర్టుని కూలగొట్టేందుకు సామగ్రితో అధికారులు చేరుకోవడంతో రాత్రికి రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. నాగరాజుకు మద్దతుగా గౌతు శిరీష, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇతర నేతలు వచ్చారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
దీని మీద అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు అని తమ వారిని విడిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారి మీద దాడులు పెరిగిపోయాయని కూడా మండిపడ్డారు. అయితే వైసీపీ నేతల వెర్షన్ వేరేగా ఉంది. అక్రమ కల్వర్ట్ ని కూలుస్తూంటే తమ్ముళ్ళకు నొప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ ప్రజా వేదికను కూల్చారు. మంత్రి కల్వర్టుని కూలుస్తున్నారు ఇది కూల్చుడు ప్రభుత్వం అని అచ్చెన్న అంటూంటే అక్రమాలను కూల్చకుండా ఊరుకుంటారా అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే వైసీపీ మంత్రి టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు అని అంటున్నారు.