భారతీయ జనతా పార్టీ.. మరోసారి తన ముద్ర చూపించింది. తన మార్కు రాజకీయం ఎలా ఉంటుందో మహారాష్ట్ర ప్రజలకు మరోసారి రుచిచూపించింది. మహారాష్ట్ర సర్కారును త్రిబుల్ ఇంజిన్ సర్కారుగా మార్చింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్సీపీలో తాజాగా చీలిక వచ్చింది. 30 మంది ఎన్సీపీ సభ్యుల మద్దతుతో.. తన నేతృత్వంలో ఉన్నదే అసలైన ఎన్సీపీ అని ప్రకటించుకుంటున్న అజిత్ పవార్.. మహారాష్ట్రకు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అయిదేళ్ల ప్రభుత్వ కాలంలో మహారాష్ట్రలో ప్రభుత్వాలు మూడుసార్లు ఏర్పడ్డాయి. ఒక విడత రాష్ట్రపతి పాలన దీనికి అదనం. అంతకంటె తమాషా ట్విస్టు ఏంటంటే.. అజిత్ పవార్ మూడుసార్లు ఉపముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణంచేశారు.
తొలుత ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేక , రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత.. ఎన్సీపీ చీలికవర్గం మద్దతుతో బిజెపి అధికారంలోకి వచ్చింది. పదవీ ప్రమాణం చేసిన 80 గంటలకే ప్రభుత్వం కూలింది. తర్వాత, బిజెపితో బంధం తెంచుకున్న శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. శివసేనలో చీలిక వచ్చి.. ఏక్‌నాథ్ షిండే సీఎంగా బిజెపి మద్దతుతో తర్వాత ప్రభుత్వం ఏర్పడింది.
తాజాగా అదే ప్రభుత్వంలోకి ఎన్సీపీ చీలిక వర్గం కూడా జత చేరింది. ఎన్సీపీలో 30 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని ప్రకటించుకున్న అజిత్ పవార్, ప్రభుత్వ జట్టులో చేరి మరోసారి ఉపముఖ్యమంత్రి అయ్యారు.
అసలైన ఎన్సీపీ తనదే అని కూడా ప్రకటించుకున్నారు. పార్టీకి ఉన్న బలంలో మెజారిటీ ప్రస్తుతం ఆయనతోనే ఉన్నారు. అయితే ఎన్సీపీ అంతర్గత రాజకీయాల ఫలితమే ఈ పరిణామం అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టుగా ఇటీవల శరద్ పవార్ ప్రకటించిన నేపథ్యంలో ఒక హైడ్రామా చోటుచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
శరద్ పవార్ ను అందరూ బతిమాలడమూ.. ఇక పార్టీకి వేరే గతి లేదన్నట్టుగా ఆయన మళ్లీ సారథ్యం తానే వహించడమూ జరిగింది. తర్వాత.. పార్టీకి ఇద్దరు కీలక ఉపసారథులను ఆయన నియమించారు. కూతురు సుప్రియా సూలేకు అవకాశం ఇచ్చారు గానీ.. అజిత్ పవార్ ను పక్కన పెట్టారు. అప్పటినుంచి అజిత్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని ఫలితం ఇప్పుడు పార్టీ చీలింది.
ఇప్పటికే శివసేన చీలిక గురించిన రచ్చ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎవరిది అసలైన శివసేన అనేది కోర్టులో నలుగుతోంది. ఇప్పుడు అజిత్ వర్గం చీలికతో ఎన్సీపీ కూడా కోర్టు గడప తొక్కబోతోంది. కానీ.. ఈ కేసులు తేలేలోగా ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తి అయిపోతుందని పలువురు అంటున్నారు. మొత్తానికి ఇతర పార్టీల్లో చీలికలే వ్యూహాలుగా, మహా రాజకీయాల్లో బిజెపి ప్రస్థానం సాగుతోంది.