తెలంగాణ గడ్డమీద రాహుల్ గాంధీ తమ ప్రత్యర్ధుల మీద నిప్పులు కురిపించారు. 1300 కిలోమీటర్లు పొడవైన మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పూర్తి అయిన సందర్భంగా ఆయనను రాహుల్ గాంధీ ఘనంగా సత్కరించారు. కర్ణాటకలో అవినీతిమయమైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపైన రీతిలోనే.. తెలంగాణలో కూడా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అంతం చేస్తామని.. ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సభలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి శంఖారావంగా పరిగణించదగిన ఈ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను తెలంగాణ పౌర సమాజం ఎందుకు విశ్వసించాలి? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన అన్ని రకాల హామీలలో ప్రధానమైనది వృద్ధాప్య పెన్షన్లను 4 వేలకు పెంచుతాం అనడం! ఈ హామీ తమ పార్టీకి బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడగలరని కాంగ్రెస్ పార్టీ అంచనావేస్తుండవచ్చు.
తెలంగాణ రాజకీయ పరిస్థితులను లోతుగా గమనిస్తే ఒకవైపు ప్రజలకు ఉచిత తాయిలాలు ఉచిత పథకాలు ఇవ్వడమే నేరం అన్నట్లుగా మాట్లాడుతున్న నరేంద్ర మోడీ దళం ఇంత పెద్ద మొత్తం వృద్ధాప్య పెన్షన్ గా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండకపోవచ్చు. భారత రాష్ట్ర సమితి కూడా తాము కాంగ్రెస్ను చూసి భయపడ్డాం అనే నింద రాకుండా ఉండడానికి ఈ హామీని పట్టించుకోకపోవచ్చు. అందుకే వృద్ధాప్య పెన్షన్ 4000 రూపాయలకు పెంచుతాం అనే హామీ తమకు తురుపుముక్క కాగలదని రాహుల్ గాంధీ భావిస్తుండవచ్చు. కానీ ఆయన మాటలను ప్రజలు ఎందుకు నమ్మాలి?
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించింది. వారు చెప్పుకుంటున్నట్టుగా బిజెపిని మట్టి కరిపించింది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏ హామీలు అయితే ఇస్తున్నారో.. వాటిని కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదు. కన్నడ సీమలో అమలులో పెడితేనే కాంగ్రెస్కు అలాంటి సంక్షేమ ఆలోచనల పట్ల విశ్వాసం ఉన్నదని తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారు. కేవలం కర్ణాటక అని మాత్రమే కాదు.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా వృద్ధాప్య పెన్షన్లను నాలుగు వేలకు పెంచితేనే తెలంగాణ ప్రజలు కూడా దానిని నమ్మగలరు. లేకపోతే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం తమ మీదకు విసిరిన తాయిలం లాగా వాళ్ళు పరిగణిస్తారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల తెలంగాణలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనుక పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని చాలా ఘనంగా ప్రకటించారు. ఇది ఉద్యోగులను ఆకర్షించే విషయం.
అయితే ఆయన తెలంగాణలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండగల అంశాన్ని పరిగణించి సాధ్యాసాధ్యాలను లెక్క వేసుకున్నారో లేదో తెలియదు. అలాంటి హామీ రాహుల్ గాంధీ నోటి వెంట రాలేదు. అలాంటప్పుడు వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం రాహుల్ చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మాలంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దానిని ముందుగా అమలు చేయడం అనేది ఆవశ్యం. ఆ సంగతి రాహుల్ గాంధీ తెలుసుకోవాలి.