ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ సింహాచలం అప్పన్న స్వామి వారిది. ప్రతీ ఏటా చందనోత్సవం రాష్ట్ర స్థాయిలో అగ్ర శ్రేణి పండుగగా జరుపుకుంటారు. దాని తరువాత వచ్చే అంతే పెద్ద వేడుక గిరి ప్రదక్షిణ. ప్రతీ ఏటా ఆషాడ మాసంలో వచ్చే పున్నమి వేళ సిం హాచలం కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణం చేస్తారు. ఇది అప్పన్న స్వామి మీద భక్తి ప్రపత్తులతో పూర్తిగా సాగే ఆధ్యాత్మిక వేడుక.
సింహాచలం చుట్టూ ముప్పయి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలి నడక మొదలెడతారు. అలా అలుపెరగని తీరున మొత్తం ముప్పయి రెండు కిలోమీటర్లను నడుస్తారు. ఇది రాత్రంతా సాగుతుంది. తండోపతండాలుగా భక్తులు వస్తూనే ఉంటారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులతో విశాఖ ఈ ఆదివారం సందడిగా మారింది. సింహాచలం చుట్టూ అంటే కొండను ఆనుకుని నగరం అంతా అభివృద్ధి చెంది ఉంది. దాంతో ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందులు కలకకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మొత్తం ఆరు లక్షల మంది భక్తులు కొండ చుట్టూ ఈసారి నడుస్తారు అని అంచనాగా ఉంది. మొత్తం ముప్పయి రెండు కిలోమీటర్లు లక్షలాది మంది భక్తులు అంటే విశాఖ అంతా భక్తజన సందోహమే కనిపిస్తుంది. ఇది చూసి తీరాల్సిందే అంటున్నారు.