ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహాన్ని నింపింది. రాహుల్ గాంధీ చేతుల మీదుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కను రాహుల్‌గాంధీ అభినందించారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ప్రసంగం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ సందర్భంగా ఆయన పింఛన్ పథకానికి సంబంధించి ప్రకటన చేయడం విశేషం. తెలంగాణలో తమకు అధికారం ఇస్తే చేయూత పేరిట వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ అందజేస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధుత్వ పార్టీగా ఆయన సెటైర్ విసిరారు. తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలే వస్తాయన్నారు. కర్నాటకలో అవినీతి ప్రభుత్వాన్ని పారదోలామన్నారు.
తెలంగాణలో బీజేపీ ఖతమైందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్‌తోనే తమ పోటీ అని రాహుల్ ప్రకటించారు. కర్నాటకలో మాదిరిగా తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఐడియాలజీ దేశాన్ని కలపడం అని ఆయన అన్నారు. కానీ ఇతరుల ఐడియాలజీ దేశాన్ని విడదీయడమని బీజేపీకి చురకలు అంటించారు.
ఇదిలా వుండగా తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణలో సానుకూల వాతావరణం ఏర్పడడంతో కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రకటించే అవకాశాలున్నాయి.