వైఎస్ బయోపిక్ గా వచ్చిన యాత్ర డీసెంట్ హిట్. ఆంధ్ర రాజకీయాల మీద 2019 లో దాని ప్రభావం కూడా కనిపించింది. ఇప్పుడు యాత్ర 2 రాబోతోంది. యాత్ర ఎలా వుంటుందో చూసాం..యాత్ర 2 ఎలా వుండబోతుంది అన్నది చూడాలి.
బేసిక్ గా యాత్రకు యాత్ర 2 కు వున్న తేడా ఏమిటంటే అది తెలియని కథ, ఇది తెలిసిన కథ. యాత్ర అన్నది వైఎస్ బయోపిక్. ఈ జనరేషన్ కు చాలా మందికి తెలియని కథ. అందువల్ల ఓ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. పైగా మమ్ముట్టి అందులో వైఎస్ పాత్రలో వొదిగిపోయారు. గంభీరమైన వాయిస్ దానికి తోడయింది.
ఇప్పుడు యాత్ర 2 అన్నది వైఎస్ జగన్ కథ. యాత్ర సినిమాకు కొనసాగింపుగా మొదలుపెట్టినా, చాలా వరకు మళ్లీ మమ్ముట్టిని వైఎస్ పాత్రలో చూపించినా, జీవా అనే నటుడిని జగన్ గా చూపించి మెప్పించాలి. కానీ సమస్య ఏమిటంటే జగన్ కథ ఏదీ జనానికి తెలియంది కాదు. 2009 తరువాత నుంచి జగన్ పేరు, జగన్ వ్యవహారాలు నిత్యం పత్రికల్లో నానుతూనే వున్నాయి. బయటకు రానివి ఏవైనా వుంటే వాటిని జోడిస్తేనే ఆసక్తి కలుగుతుంది.
యాత్ర సినిమాకు కొనసాగింపుగా వైఎస్ పాలనను, స్కీములను గుర్తు చేస్తూ సినిమాను నడుపుతూ వైఎస్ మరణం తరువాత జగన్ మీదకు సినిమాను తీసుకువస్తారు. కాంగ్రెస్ మీద జగన్ తిరుగుబాటు ను ఎంత వరకు ఫోకస్ చేస్తారనన్నది చూడాలి. అదే విధంగా కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలతో కలిసి తెరవెనుక పన్నిన కుట్ర ఏదైనా వుందీ అంటే అది వెలికి తీసి చూపిస్తారా అన్నది చూడాలి. అలాంటివి అన్నీ ఆర్జీవీ వ్యూహం సినిమాకు వదిలేస్తారేమో?
మరింకేం చూపించాలి. జగన్ పాదయాత్ర, ఎన్నికలు, విజయం, నవరత్నాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇక్కడితో ఆపాలి తప్ప, అంతకన్నా ముందుకు వెళ్లడం వుండకపోవచ్చు.
అంటే యాత్ర సినిమా వైఎస్ పదవీ స్వీకారంతో ముగిస్తే, యాత్ర 2 జగన్ పదవీ స్వీకారంతో ముగిసే అవకాశం వుంది. బట్ ఇలా చూసుకుంటే యాత్రకు వచ్చిన క్రేజ్ యాత్ర 2 కు ఏమాత్రం వస్తుందన్నది చూడాల్సి వుంది.