ప్రజా గాయకుడు గద్దర్ విప్లవ పంథా వదిలి రాజకీయ బాట పట్టారు. తనకంటూ సొంత పార్టీని పెట్టుకున్నారు. గత నెలలో గద్దర్ ప్రజాపార్టీ పేరుతో రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఏడు దశాబ్దాల పైబడి వయసులో ఆయన రాజకీయ పార్టీ పెట్టడం చర్చనీయాంశమైంది. గద్దర్ వాలకం చూస్తుంటే సీరియస్‌గా రాజకీయాలు చేసే మనిషిలా కనిపించడం లేదు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీపై మరోసారి తన అభిమానాన్ని ఆయన చాటుకున్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ జనగర్జన సభను ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్నారు. ఈ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితర నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
ఇదే సందర్భంలో గద్దర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ విధానాలు తనకు నచ్చాయ న్నారు. ఇవాళ కాంగ్రెస్‌లో తాను చేరగలనన్నారు. కానీ తాను పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్‌లో చేరలేకపోతున్నట్టు గద్దర్ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ వుండవని గద్దర్ జోస్యం చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు ఆయన నర్మగర్భ వ్యాఖ్య చేశారు.
ఇటీవల కాలంలో బీజేపీలో అంతర్గత గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ ముఖ్య నాయకులు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గద్దర్ రాజకీయ జోస్యం చర్చనీయాంశమైంది.