మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తనకు న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్తోమత లేదంటున్నాడు. ఒకవైపు దస్తగిరి పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఆర్థికంగా తనకు అంతసీన్ లేదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం.
వివేకా దగ్గర సుదీర్ఘ కాలం పీఏగా పని చేసిన ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ఆయన సవాల్ చేయడం చర్చనీయాంశమైంది. కృష్ణారెడ్డి పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు వాదన వినిపించాలని దస్తగిరికి నోటీసులు పంపింది. సుప్రీంకోర్టులో తన తరపున వాదించేందుకు న్యాయవాదిని పెట్టుకోవడం దస్తగిరికి ఆర్థికంగా భారమైంది.
దీంతో తన ఆర్థిక నిస్సహాయతను తెలియజేస్తూ, న్యాయసాయం చేయాలని సుప్రీంకోర్టుకు దస్తగిరి విన్నవించాడు. దీనిపై సోమ వారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.
ఇదిలా వుండగా వివేకా హత్య కేసు విచారణ గడువు ముగిసింది. మరికొంత కాలం పొడిగించాలని సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వివేకా హత్య కేసుపై ఇటీవల కాలంలో చర్చకు దాదాపు తెరపడింది. తాజాగా దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఆ విషయమై ప్రస్తావన వచ్చినట్టైంది.