రాజకీయంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరనేందుకు తగిన ఉదాహరణ తెలంగాణ రాజకీయం. రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడుస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తిదాయకంగా మారాయి.
ఒకానొక దశలో ఏకపక్ష విజయాలతో తెలంగాణ రాజకీయం అనాసక్తిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన సమయంలో జరిగిన ఎన్నికల్లో అంత స్వీప్ చేయకపోయినా టీఆర్ఎస్ పై చేయి సాధించింది. అయితే ఏ పార్టీ తరఫున గెలిచినా వారందరినీ తన పార్టీలోకి చేర్చేసుకున్నారు కేసీఆర్. దీంతో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు.. ఇలా వరసగా తెరాసలోకి విలీనం అయిపోయాయి! ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఆ పార్టీలోకి చేరిపోయారు. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా వరస పెట్టి చేరికలు టీఆర్ఎస్ వైపుగా వెళ్లాయి. దానికి తోడు ఆ సమయంలో వచ్చిన రకరకాల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు స్థాయి మెజారిటీలతో విజయాలను సాధించి సంచలనం రేపింది.
తొలి ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న తర్వాత ఎన్నికలను ఎదుర్కొనాల్సిన సమయంలో కేసీఆర్ కు చంద్రబాబు రూపంలో వరప్రదమైన అవకాశం లభించింది. అయితే చంద్రబాబు ఆ సమయంలో కేసీఆర్ కు మిత్రుడు కాదు. శత్రువుగానే కేసీఆర్ కు ఎంతో మేలు చేశాడు చంద్రబాబు నాయుడు.
కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడంతో కేసీఆర్ కు సువర్ణావకాశం లభించింది. చంద్రబాబుతో దోస్తీ తమకు మేలు చేస్తుందనే రాంగ్ ఎస్టిమేషన్స్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తు అయ్యింది. ఐదేళ్ల ప్రతిపక్ష వాసం అనంతరం చంద్రబాబుతో పొత్తుతో వెళ్లి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను మరింత బలవంతుడిగా చేసింది.
ఒకవేళ తెలంగాణ అసెంబ్లీకి ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కుగనుక టీడీపీతో పొత్తు లేకపోయి ఉంటే, టీఆర్ఎస్ కు అన్ని సీట్లు దక్కేవి కాదనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం. చంద్రబాబును కలుపుకువెళ్లి కేసీఆర్ ను మరింత బలవంతుడిగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గొప్ప విషయం ఏమిటంటే… చంద్రబాబుతో దోస్తీ లేకపోవడం! చంద్రబాబును మోసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ కృశించిపోయింది. ఆ దెబ్బకు చాన్నాళ్ల పాటు కోలుకోలేకపోయింది.
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త జోష్ అయితే కనిపిస్తూ ఉంది. అంత వరకూ ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాని జోష్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం కాంగ్రెస్ లో తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. మొన్నటి వరకూ తెలంగాణలో పోటీ అంటే అది టీఆర్ఎస్ బీజేపీల మధ్యనే అనేంత స్థాయిలో ఉండేది వ్యవహారం.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మంచి పోటీ ఇచ్చింది బీజేపీనే. అయితే హైదరాబాద్ ఆవల బీజేపీ బలం మాత్రం ప్రశ్నార్థకమే అప్పటికీ! మునుగోడు బైపోల్ లో ఓటమి బీజేపీని మరింత కిందకు దించింది. హైదరాబాద్ అవతల బీజేపీకి ఊహించుకున్నంతటి సీన్ ఏమీ లేదనే క్లారిటీ నేతలకు కూడా వచ్చింది. బీజేపీ ఇప్పటికీ తెలంగాణలో సంస్థాగతంగా బలపడకపోవడం కూడా నేతలు ఆ పార్టీ వైపు చూడకపోవడానికి మరో కారణం. ఇప్పుడు చిన్నా పెద్ద తేడా లేకుండా నేతలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఆ పార్టీలో ఈ చేరికలు మరింత నమ్మకాన్ని పెంచుతూ ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాకా తొలి ఐదేళ్లలో ఎంతో కొంత ప్రయోజనాలు పొందిన వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండటం మరో విశేషం. నామినేటెడ్ పోస్టులు పొందిన వారు, ప్రభుత్వ మర్యాదలు పొందిన వారు కూడా ఇప్పుడు కేసీఆర్ పై విముఖతను పెంచుకున్నారు. వారంతా బీజేపీ వైపు కాకుండా, ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. రాజకీయ నేతలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వారు కూడా కేసీఆర్ తో ఇక చాలనట్టుగా కాంగ్రెస్ వైపు చేరుతున్నారు. చాలా ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ కు ప్రస్తుత పరిణామాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తుండటం సహజమే.
రాష్ట్రాన్ని విడదీసి ప్రయోజనం పొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో తెలుగునాట చిత్తవుతూ వచ్చింది. ఏపీలో అయితే శాశ్వతంగా అడ్రస్ పోగొట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో దానికి మళ్లీ ఆశలు మొలకెత్తుతున్నాయి. అయితే అధికారాన్ని అందుకోవడానికి కాంగ్రెస్ కు ఇవి చాలకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఎదుర్కొనాల్సింది కేసీఆర్ వంటి వాడిని.
కేసీఆర్ పని ఎప్పటికప్పుడు అయిపోయినట్టుగానే ఉంటుంది. అయితే ఏదో ఒక పరిణామాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ మళ్లీ రాజకీయంగా సత్తా చాటుతూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఆయన అలాంటి పరిణామం కోసమే కేసీఆర్ ఇప్పుడు ఎదురుచూస్తూ ఉండవచ్చు. కేసీఆర్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే అంతే సంగతులు!