డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు వచ్చి శాటిలైట్ ను పడుకోపెట్టేసాయి. సినిమాలను టీవీలో చూసే పరిస్థితి రాను రాను తగ్గిపోతోంది. అదే గేమ్ షో లు అయితే, కనీసం యూ ట్యూబ్ లో అయినా ఆదాయం తెచ్చుకోవచ్చు. భారీ రేట్లకు సినిమాలు కొన్నా టీఆర్పీలు అంతంత మాత్రంగానే వుంటున్నాయి. దాంతో శాటిలైట్ రేట్లు రాను రాను తగ్గిపోతున్నాయి. పోనీ, తగ్గినా, హెచ్చినా అమ్మకాలు/కొనుగోళ్లు వుంటే ఫరవాలేదు. కానీ ఇప్పుడు అవి కూడా తగ్గుతున్నాయి.
చిన్న సినిమాలు అంటే చాలు ఇక శాటిలైట్ అమ్మకం గురించి మరిచిపోవాల్సి వస్తోంది. మిడ్ రేంజ్ సినిమాలు లేదా హిట్ టాక్ లేదా మంచి సినిమా అనే టాక్ తెచ్చుంటే ఓకె. కనీసం కోటి నుంచి రెండు కోట్ల వరకు శాటిలైట్ తెచ్చుకోవచ్చు. పెద్ద సినిమాలు అయితే అమ్మకం వరకు ఫరవాలేదు. కానీ రేట్ మాత్రం గ్యారంటీ లేదు. చిన్న సినిమాలకు ఏ పరిస్థితీ లేదు.
సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నది సామెత. ఓటిటి ఆదాయం పెరిగింది అని సంతోషించాలో, శాటిలైట్ పోయిందని బాధపడాలో తెలియని పరిస్థితి. పైగా చిన్న సినిమాలు అంటే ఎక్కువగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలు వుంటాయి. వాటికి హిందీ మార్కెట్ కూడా వుండదు. ఫైట్లు, యాక్షన్ సీన్లు వుంటేనే హిందీ మార్కెట్.
మరో పక్కన ఏ ఓటిటిని నమ్ముకుని సినిమా తీస్తున్నారో అది కూడా తగ్గుముఖం పడుతోంది. బడా కార్పొరేట్ సంస్థలు చిన్న సినిమాల కేసి చూడడం లేదు. ఆహా లాంటి లోకల్ ఓటిటి సంస్థలే దిక్కు అవుతున్నాయి. మిడ్ రేంజ్, బిగ్ రేంజ్ సినిమాల వరకు ప్రస్తుతానికి ఓటిటి వర్కవుట్ అవుతోంది. అది కూడా మెలమెల్లగా తగ్గుతుందని టాక్ వినిపిస్తోంది.
మొత్తం మీద రాను రాను ట్రెండ్ చూస్తుంటే ఇక చిన్న సినిమాలు అంటే…10 కోట్ల రేంజ్ సినిమాలు ఇక తగ్గిపోవచ్చు అనిపిస్తోంది. అదే చిన్న హీరోలతో 15 కోట్ల రేంజ్ ఖర్చు చేస్తే నిర్మాత కు కష్టకాలమే.