సెల‌బ్రిటీల జీవితాల్లోకి మీడియా చొర‌బాటు.. ఎంత వ‌ర‌కూ?

కాస్త బ‌క్క‌చిక్కిన‌ట్టుగా క‌నిపించిన వారి మీదే మీడియా ప్ర‌తాపం! బాగా బలిసిన‌ట్టుగా అగుపిస్తే అటు వైపు క‌న్నెత్త‌డానికి కూడా భ‌యం భ‌యం!

ఒకే ఒక సూటి ప్ర‌శ్న‌.. అలాంటి వివాదం మోహ‌న్ బాబు ఇంట కాకుండా.. మ‌రో సినిమా ఇంట జ‌రిగి ఉంటే.. మీడియా గొట్టాలు అంత ద‌గ్గ‌ర వ‌ర‌కూ వెళ్ల‌వా? ఇలాంటి వివాదాలు చాలా ఇళ్ల‌లో ఉంటాయి. గ‌తంలో పుకార్ల స్థాయిలో ఇలాంటి వ్యాపించాయి. అయితే అప్పుడు మీడియాకు ఇంత అత్యుత్సాహం లేదు! ఎందుకు? ఆర్థికంగా ఆ కుటుంబాలు మోహ‌న్ బాబు క‌న్నా చాలా చాలా భారీ స్థాయిలో ఉండ‌టం వ‌ల్ల‌నా? ఒక సినిమా స్టూడియోను క‌లిగి ఉన్న ఒక సినిమా కుటుంబంలో కొన్నాళ్ల కింద‌ట ఆస్తుల విష‌యంలో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య‌న ఇలాంటి వివాద‌మే ఒక‌టి త‌లెత్తింద‌ని ఆఫ్ ద రికార్డుగా కొంత ప్ర‌చారం జ‌రిగింది.

అన్న‌ద‌మ్ములు ఆస్తుల విష‌యంలో గొడ‌వ‌ప‌డుతున్నార‌ని, తండ్రి పోయిన త‌ర్వాత ఎవ‌రికి ఎంత భాగం అనే విష‌యంలో వారి మ‌ధ్య‌న ఘ‌ర్ష‌ణాత్మ‌క వైఖ‌రి త‌లెత్తింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అది ఉత్తి ప్ర‌చారంగానే మిగిలింది. అయితే మోహ‌న్ బాబు ఇంటి ర‌చ్చ‌ను వీధికి తీసుకురావ‌డంలో ఆయ‌న త‌న‌యుల పాత్ర కూడా ఉంద‌ని స్ప‌ష్టం అవుతూ ఉంది. కొన్ని నెలల కింద‌టే ఈ వివాదం త‌లెత్తింది. అప్పుడే మంచు మ‌నోజ్ వీడియో లీక్ ద్వారా వివాదాన్ని అందరికీ తెలియ‌జేశాడు. ఆ త‌ర్వాత నివురుగ‌ప్పిన నిప్పు మంట‌లుగా మారి మంచు ఫ్యామిలీ ఇమేజ్ ను వీధికి లాగింది.

ఇక ఇదే స‌మ‌యంలో మీడియా కూడా అంది వ‌చ్చిన అవ‌కాశంతో త‌న హ‌ద్దుల‌న్నింటినీ చెరిపేసుకుని దూసుకుపోయింద‌ని కూడా చెప్ప‌కత‌ప్ప‌దు! అయితే ఇలాంటి వివాద‌మే, ఇంకో సినిమా కుటుంబంలో త‌లెత్తి ఉంటే, ఆ ఇంట్లో వాళ్లు కూడా ఇలాగే ఎంతో కొంత అవ‌కాశం ఇచ్చి ఉన్నా.. మీడియా ఇంత స్థాయిలో దూసుకుపోతుంద‌నేది మాత్రం అనుమాన‌మే! వెనుక‌టికి రామోజీ రావు ఇంట్లో ఇలాంటి ర‌చ్చే రేగింది.

రామోజీ రావు చిన్న కొడుకు సుమ‌న్ ను ఇంట్లోంచి వెలివేసినంత ప‌ని చేశార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అదే విష‌యాన్ని సుమ‌న్ చెప్పుకుని వాపోయాడు కూడా! అప్ప‌టికే దీర్ఘ‌కాలిక జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న సుమ‌న్ ప్ర‌త్య‌ర్థి మీడియాకు ఎక్కి మ‌రీ త‌న బాధ‌ను చెప్పుకున్నాడు! అయితే అప్పుడు సోకాల్డ్ త‌ట‌స్థ మీడియా కిక్కురుమ‌న‌లేదు! అప్ప‌టికే టెలివిజ‌న్ మీడియా విస్తృతంగా ఉంది. అప్ప‌టికే తెలుగులో ఆరేడు న్యూస్ చాన‌ళ్లున్నాయి. ఇప్ప‌టిలా సోష‌ల్ మీడియా మాత్ర‌మే లేదు.

అయితే రామోజీ ఇంట్లోని ఆ ర‌చ్చ‌పై వార్త‌ల‌ను ఇవ్వ‌డానికి కూడా ఏ న్యూస్ చాన‌ల్ ముందుకు రాలేదు. ప్ర‌త్య‌ర్థి మీడియా కాబ‌ట్టి.. అప్ప‌ట్లో సాక్షి ప‌త్రిక సుమ‌న్ ఇంట‌ర్వ్యూల‌ను ఇవ్వ‌గ‌లిగింది. లేక‌పోతే అది రామోజీ ఇంటి ర‌చ్చ‌గా ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్కేది కూడా కాదు. రామోజీ రావు తీరును త‌ప్పు ప‌డుతూ సుమ‌న్ సాక్షికి ఇంట‌ర్వ్యూ ఇచ్చాకా కూడా.. ఇంకో మీడియా వెళ్లి ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూ తీసుకునే సాహ‌సం చేయ‌లేదేంటే.. మీడియాకు త‌న ప‌రిధుల‌పై ఎంత భ‌యం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు!

మ‌రి రామోజీ ఇంట్లో ర‌చ్చ ఎలాంటిదో ఇప్పుడు మోహ‌న్ బాబు ఇంట్లో ర‌చ్చ కూడా అలాంటిదే అని క‌చ్చితంగా చెప్పొచ్చు. అప్పుడు సుమాన్ తో ఇంట‌ర్వ్యూలు చేయ‌డానికి మీడియాకు భ‌యం. అయితే ఇప్పుడు అలాంటి భ‌యం ఎవ్వ‌రికీ లేదు. ఆఖ‌రికి ఊరూపేరులేని యూట్యూబ్ చాన‌ళ్లు కూడా గొట్టాలు పెట్టేస్తున్నాయి. దీంతో మోహ‌న్ బాబు రియాక్ట్ అయ్యాడు, మీడియాపై విరుచుకుప‌డ్డాడు. మామూలుగా అయితే మోహ‌న్ బాబును నెటిజ‌న్లు, సామాన్యులు కూడా ఇలా చేస్తే ఎండ‌గ‌ట్టేవాళ్లేనేమో! అయితే అనూహ్యంగా మోహ‌న్ బాబుపై ఇక్క‌డ సానుభూతి కూడా వ్య‌క్తం అవుతోంది. కాకులు, రాబంధుల్లా ఇలా గొట్లాలేసుకుని ఇంటి చుట్టూరా చుట్టుకుంటే.. అలా కొట్ట‌క మోహ‌న్ బాబుకు మాత్రం మరే మార్గం ఉంది అనే అభిప్రాయాలు విస్తృతంగా వినిపిస్తూ ఉన్నాయి!

ప్రైవేట్ జీవితం మీ ఇష్టం, ప‌బ్లిక్ లోకి వ‌స్తే వంద అంటాం.. అనేది త‌ర‌చూ వినిపించే మాటే! అయితే.. మీడియాకు కూడా ఈ విష‌యంలో చాలా లెక్కాప‌త్రాలున్నాయ‌నేది సుస్ప‌ష్టం. మోహ‌న్ బాబు కాబ‌ట్టి.. ఇలా వెళ్ల‌గ‌లుగుతున్నారు. అదే మ‌రొక స్టార్ హీరో కుటుంబం జోలికి, వారి మ‌ధ్య‌న విబేధాల జోలికి ఇలా వెళ్లే స‌త్తా మీడియాకు లేదు! సినిమా స్టార్లు, సెల‌బ్రిటీలు అయినా.. వారి వారి ఆర్థిక శక్తులు, వారి వెనుక ఉన్న స్టూడియోలు, వారి ఆర్థిక శ‌క్తి, వారు ఫామ్ లో ఉండటం, వారి సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలుస్తూ ఉండ‌టం.. ఇలాంటి ర‌క‌ర‌కాల ఫ్యాక్ట‌ర్లు మీడియాను కూడా ప్ర‌భావితం చేస్తాయి! బాల‌కృష్ణ ఇంట్లో కాల్పులు జ‌రిగితే.. అక్క‌డ నుంచి ఏ మేర‌కు గొట్టాలు పెట్టి విశ్లేషించగ‌లిగారు? అస‌లు వార్త‌లు రాయ‌డానికే భ‌య‌ప‌డ్డారు క‌దా! ఒక స్టార్ హీరో ఇంట్లో కాల్పులు అంటూ ఇప్ప‌టికీ ప‌రోక్షంగానే అలాంటి ఇన్సిడెంట్ ను ప్ర‌స్తావించేత పెద్ద మ‌న‌సు ఉన్న మీడియా ఇది!

ఇలా మీడియా కు కూడా చాలా హ‌ద్దులున్నాయి. అంద‌రి జోలికి వెళ్ల‌లేదు, అవ‌కాశం ఉన్న వాళ్ల జోలికే వెళ్తుంది. వారి ఇంటి ముందే మీడియా గొట్టాలు క‌నిపిస్తాయి. కాస్త బ‌క్క‌చిక్కిన‌ట్టుగా క‌నిపించిన వారి మీదే మీడియా ప్ర‌తాపం! బాగా బలిసిన‌ట్టుగా అగుపిస్తే అటు వైపు క‌న్నెత్త‌డానికి కూడా భ‌యం భ‌యం! తీరా అలాంటి దాడులు ఎదుర‌యితే మాత్రం.. మీడియాపై దాడులా అంటూ హూంకారాలు! అంద‌రి జోలికీ ఒకేలా వెళ్ల‌గ‌లిగితే.. అప్పుడు మీరే ర‌చ్చ‌కు ఎక్కారు మేం చూపిస్తున్నామ‌ని వాదించొచ్చు. అయితే సెల‌బ్రిటీల విష‌యంలో కూడా సెల‌క్టివ్ గా ఉంటే.. అప్పుడు సామాన్యుడి స‌పోర్ట్ అయినా ఎలా ద‌క్కుతుంది?

5 Replies to “సెల‌బ్రిటీల జీవితాల్లోకి మీడియా చొర‌బాటు.. ఎంత వ‌ర‌కూ?”

  1. chirunjeevi meeda aayana mugguru allullu caselu pettaru….aayana peddalludu, ah tarvatha vachina sirish bharadwaj, ee madhyane vidipoyina kalyana dev…veellandaru caselu pettinavalle….veeti gurinchi evaru rayaru

  2. మీడియా అయన అనుమతి లేకుండా అయన ఇంట్లోకి ఏ విధంగా వెళుతుంది కోర్ట్ లు పోలీస్ లు తప్ప వేరే వాళ్ళ ఇళ్లలోకి అనుమతి లేకుండా వెళ్లడం చాలాతప్పు అందుకే వాళ్ళను అయన తోలు తీసేడు

Comments are closed.