వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కడపలో కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోడానికి సీరియస్‌గా అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు ముందే చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతానికి ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోడానికి రెడీ అయ్యినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అప్రమత్తం అయ్యారు. కడపలో పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు పార్టీ మారుతున్నారన్న సమాచారంతో ఆయన హడావుడి చేస్తున్నారు. కడపలో కార్పొరేటర్లతో చర్చిస్తున్నారు. వాళ్ల సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వీలైనంత వరకూ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులన్న కార్పొరేటర్ల సమస్యల్ని ప్రత్యేకంగా చూస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిసింది.
ఏదో రకంగా కడపలో కార్పొరేటర్లను నిలుపుకోవాలని వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకు ఎంపీ అవినాష్ నాయకత్వం వహిస్తున్నారు. ఇదే పని ముందు నుంచి చేసి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదనే బాధ కడప కార్పొరేటర్లలో వుంది.
అధికారంలో ఉండగా ఏమీ చేయలేదని, ఇక లేనప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న కార్పొరేటర్ల నుంచి వస్తోంది. ఏది ఏమైనా కడపలో కార్పొరేషన్‌ను నిలుపుకోవడం వైసీపీకి ప్రతిష్టాత్మకమైంది.