ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, ఏపీ సర్కార్ మధ్య వివాదం డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. అధికార పార్టీ వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కాదు , ఎస్ఈసీనే అనేంతగా వైరం నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేయాలనే పట్టుదలతో అధికార పార్టీ ఉండగా, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ పంతం పట్టారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.
అధికార పార్టీకి ఏ ఒక్క చిన్న మేలు కలగడానికి కూడా సహించని నిమ్మగడ్డ …పొరపాటుగానో, గ్రహపాటుతోనో ఆ తప్పు చేసి అధికార పార్టీకి ఆయాచిత లబ్ధి కలిగిస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరగనుండడంతో కోడ్ అమల్లోకి వచ్చింది.
దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం అమలుకు బ్రేక్ పడింది. పట్టణాల్లో మాత్రం విజయవంతంగా ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇంటింటికి రేషన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది.
రేషన్ డోర్ డెలివరీపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ఎన్నికల సంఘాని(ఎస్ఈసీ)దేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే పేదలకు సంబంధించిన పథకంపై మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచిస్తూ, ఇందు కోసం ఐదు రోజుల సమయాన్ని ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రత్యేక దృష్టి సారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి రేషన్ డెలివరీ వాహనాలను సంబంధిత అధికారులు ఈ రోజు తీసుకెళ్లారు. రేషన్ పంపిణీ విధానంపై నిమ్మగడ్డ రమేశ్‌కు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వివరించారు. ఇందులో భాగంగా వాహనాలను ఎస్ఈసీ స్వయంగా పరిశీలించారు.
ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకుంది. రాష్ట్ర ప్రభుత్వం “ఎస్” అంటే… ఎస్ఈసీ “నో” అంటున్న విషయం తెలిసిందే. దీంతో రేషన్ డోర్ డెలివరీపై పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు ఎస్ఈసీ ఏదో ఒక సాకుతో “నో” చెబుతారనే అనుమానాలు సర్వత్రా ఉన్నాయి. అయితే అదే జరిగితే మాత్రం అధికార పార్టీ వైసీపీ నెత్తిన పాలుపోసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే ప్రభుత్వంపై కోపంతో పేదలకు సంబంధించిన పథకానికి ఎస్ఈసీ అడ్డు చెబితే …. అది ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎస్ఈసీకి జనంలో బాగా నెగెటివ్ అయ్యే ప్రమాదం ఉంది.
పేదలకు ఇంటింటికి రేషన్ సరుకులు సరఫరా చేయాలని తాము భావిస్తే …ప్రతిపక్షాలు, ఎస్ఈసీ మూకుమ్మడిగా కుట్రపన్ని అడ్డుకున్నాయంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార పార్టీకి మంచి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఈ కోణంలో అధికార పార్టీకి అస్త్రం అందించినట్టవుతుందని ఎస్ఈసీ లోతుగా ఆలోచిస్తే మాత్రం ….పథకం అమలుకు రెడ్‌సిగ్నల్ వేయరు.
ఒకవేళ అందుకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం ప్రభుత్వానికి మేలు చేసినట్టే అని చెప్పక తప్పదు. ఆవేశం విచక్షణను చంపేస్తుందని చెబుతారు. ఇప్పుడు ఎస్ఈసీ, అధికార పార్టీ మధ్య ఆవేశాకావేశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో నిమ్మగడ్డ నిర్ణయంపై సహజంగానే ఉత్కంఠ నెలకుంది.