ఒకవైపు రైతుల ధర్నాలు, నిరసనల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ ఉండగా, ఇదే సమయంలో ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ఎయిర్ పోర్టులో ధర్నాకు దిగడం గమనార్హం. అది కూడా బీజేపీ పాలిత యూపీ రాజధాని అయిన లక్నో ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఏ ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాల్లోనో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనో ప్రహ్లాద్ మోడీ ధర్నాకు దిగి ఉంటే.. భక్తులు ఎలా స్పందించే వారో కానీ, యూపీలో ఆయన ధర్నాకు దిగారు.
తన ప్రయాణంలో భాగంగా లక్నో ఎయిర్ పోర్టుకు వెళ్లిన ప్రహ్లాద్ మోడీ అక్కడ తన అనుచరులను ఎయిర్ పోర్టులోకి రానీయలేదని నిరసన తెలియజేస్తూ ధర్నాకు దిగినట్టుగా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఒక కథనాన్ని ఇచ్చింది.
తన వారిని రానీయాలని కోరిన ప్రహ్లాద్ మోడీకి నిరాకరణ ఎదురవ్వడంతో ధర్నాకు దిగినట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాలని ఆ పత్రిక పేర్కొంది.