మీరు మంచి పుత్రుడేనా? చెక్ చేసుకోండి!

త‌ల్లిదండ్రులు చేసిన దాంట్లో లోటుపాట్లు కన‌ప‌డినా వారిపై కృత‌జ్ఞ‌తాభావం లేక‌పోతే జీవిత‌మే వ్య‌ర్థం

మీ త‌ల్లిదండ్రుల‌కు మీరు మంచి పుత్రుడేనా.. అంటే చాలా ఈజీగా య‌స్ అనే స‌మాధాన‌మే చాలా మంది నుంచి వ‌స్తుంది. అయితే కొడుకుగా బాధ్య‌త‌లను చూసుకోవ‌డం అయినా, ప్రేమ‌ను పంచ‌డం అయినా అంత తేలిక కాదు. ఎవరికి వారు తాము మంచి పుత్ర సంతాన‌మే అని చెప్పుకున్నా, చెక్ చేసుకోవాల్సిన అంశాలైతే ఉన్నాయి. ఎంతో పేరు, ప్ర‌ఖ్యాతుల‌ను, ఆస్తిపాస్తుల‌ను కూడ‌బెట్టి.. మంచి ఫ్లాట్ ఫామ్ ఇచ్చిన త‌ల్లిదండ్రుల‌నే ర‌చ్చ‌కీడ్చే సంతానాలు ఎంతోమంది ఉంటారు. మ‌రోవైపు ఇది బిజీ వ‌ర‌ల్డ్. ఈ బిజీగజిబిజి ప్ర‌పంచంలో.. మంచి చెడుల‌కు ప్ర‌మాణాలు కూడా మారిపోయాయి. అది త‌ల్లిదండ్రుల విష‌యంలో కూడా! మ‌రి ఇంత‌కీ గుడ్ స‌న్ ఎలా ఉంటాడంటే..!

చిన్న‌చిన్న‌వే గొప్ప‌!

కొడుకుగా పుట్టాకా, నెర‌వేర్చాల్సిన బాధ్య‌త‌లు ఎన్నో ఉంటాయి. అందులో చిన్న చిన్న‌వాటితో మొద‌లుపెడితే రోజులు గ‌డిచే కొద్దీ పెద్ద పెద్ద బాధ్య‌త‌లు ఎదుర‌వుతూ ఉంటాయి. ప్ర‌తిద‌శ‌లోనూ వాటిని దృష్టిలో ఉంచుకుని మెలిగే వాడే గుడ్ సన్ అని చెప్పాలి. టీనేజ్ ద‌గ్గ‌ర నుంచి, ఇంకా చెప్పాలంటే ఇంకా అర్లీ ఏజ్ నుంచి.. ఇంట్లో చిన్న చిన్న బాధ్య‌త‌లు తీసుకుని, తండ్రికి సాయంగా నిలిచేవాడే మంచి కొడుకు అనిపించుకుంటాడు! చిన్న చిన్న బాధ్య‌త‌లు తీసుకునే వారు జీవితంలో గొప్ప బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌గ‌ల‌రు కూడా!

అభిప్రాయాల‌కు విలువ‌నివ్వ‌డం!

పితృవాక్య ప‌రిపాల‌కులుగా వ్య‌వ‌హ‌రించాలి అనడం లేదు కానీ, త‌ల్లిదండ్రుల అభిప్రాయాల‌కు విలువ‌నివ్వాల్సిన అవ‌స‌రం అయితే క‌చ్చితంగా ఉంటుంది. ఒక‌వేళ వారి అభిప్రాయాల‌ను మీరు వంద శాతం పాటించ‌లేక‌పోయినా.. మీ అభిప్రాయాలు మీవి అయినా, త‌ల్లిదండ్రుల అభిప్రాయాల‌ను తుంగ‌లో తొక్కే ప్ర‌య‌త్నాలు అయితే చేయ‌రాదు. అది బంధువుల విష‌యంలోనో, వృత్తుల విష‌యంలోనో, ఆర్థిక ప‌ర‌మైన‌, సామాజిక‌ప‌ర‌మైన అంశాల మీదో.. ఏదైనా కావొచ్చు మీ అనుభ‌వాల‌ను బ‌ట్టి మీరు అభిప్రాయాల‌ను ఏర్ప‌రుచుకున్న‌ట్టే, వారి అభిప్రాయాల వెనుక మీ క‌న్నా ఎక్కువ అనుభ‌వం ఉంటుంద‌ని గ్ర‌హించ‌గ‌ల‌గాలి. వారి ఆలోచ‌నా ధోర‌ణిని కొట్టి ప‌డేసి, వారిని చిన్న‌బుచ్చుకునేలా చేసే వారెవ్వ‌రూ మంచి కొడుకు కాదు!

రోజూ కాల్ చేయాలి!

వృత్తి వ్యాపారాల్లో అనునిత్యం బిజీగా ఉండే వాళ్లు కూడా.. గ్ర‌హించాల్సిన అంశం ఏమిటంటే.. తాము స్పెండ్ చేసే స‌మ‌యం కోసం త‌ల్లిదండ్రులు వేచి ఉంటార‌ని. ప‌ని ఉన్నా లేక‌పోయినా, ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేక‌పోయినా.. ప్ర‌తి రోజూ త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి మాట్లాడ‌టం అనేది క‌నీస బాధ్య‌త‌. రోజూ మాట్లాడుకోవ‌డానికి ఏమీ ఉండ‌క‌పోయినా.. ఫోన్ చేయ‌డం, వీలైన‌ప్పుడ‌ల్లా వారి వ‌ద్ద‌కు వెళ్లి వ‌స్తూ ఉండ‌టం క‌చ్చితంగా చేయాల్సిన ప‌నులు. ఒకే చోట ఉంటూ బ‌తికే రోజులు కావు ఇవి. కాబ‌ట్టి.. అవ‌కాశం ఉన్నప్పుడ‌ల్లా వారితో మాట్లాడుతూ ఉండ‌టం, మీ జీవితంలోని విష‌యాల‌ను వారికి షేర్ చేస్తూ ఉండ‌టం మీ క‌నీస బాధ్య‌త‌.

వారిపై కృత‌జ్ఞ‌త ఉండాలి!

త‌మ త‌ల్లిదండ్రులు త‌మ‌కేం ఇవ్వ‌లేద‌ని, ఉన్న‌ది పోగొట్టార‌ని, త‌మ‌కు అన్యాయం చేశార‌ని, తమ అన్న మీదో, త‌మ్ముడి మీదో వారికి ఎక్కువ ప్రేమ అని.. ఇంకోట‌ని.. స‌వాల‌క్ష ర‌కాలుగా వారిని నిందించే పుత్రుల‌కు స‌మాజంలో ఏ మాత్రం లోటు లేదు! సొంత త‌ల్లిదండ్రుల‌తో ఏదో ర‌క‌మైన పేచీలు పెట్టుకుని వారు ఉంటే ఇంటికి వీరు వెళ్ల‌క‌, వీరి ఇంటికి వారిని రానివ్వ‌ని పుత్రులు కోకొల్ల‌లు. వారి మ‌ధ్య వివాదాల‌ను చూస్తే అన్నీ చిన్న‌చిన్న‌వే!

త‌న క‌న్నా త‌న త‌మ్ముడికి ఒక ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఎక్కువ ఇచ్చాడ‌ని తండ్రి మొహం చూడ‌ని కొడుకులు ఉన్నారు. వీరి జీత‌మే నెల‌కు రెండు ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటుంది. మ‌హా అంటే ఐదు నెల‌ల జీతం విలువ స్థాయి గొడ‌వ‌తో త‌మ్ముడినీ, త‌ల్లిదండ్రుల‌ను అప‌రిమితంగా ద్వేషించే ఐటీ ఉద్యోగస్తులు వృత్తిలో అవార్డుల‌ను అందుకుంటూ ఉంటారు. అయితే త‌ల్లిదండ్రులంటే మాత్రం ప‌డ‌దు! విన‌డానికి వింత‌గానే ఉన్నా.. ఇలాంటి ర‌చ్చ‌లు ఎన్నో క‌నిపిస్తాయి చుట్టుప‌క్క‌ల‌! అయితే త‌ల్లిదండ్రులు చేసిన దాంట్లో లోటుపాట్లు కన‌ప‌డినా వారిపై కృత‌జ్ఞ‌తాభావం లేక‌పోతే జీవిత‌మే వ్య‌ర్థం! త‌ల్లిదండ్రుల‌పై ద‌య‌లేని పుత్రుడు పుట్ట‌నేమి, గిట్టేనేమి.. పుట్ట‌లోని చీమ‌లు పుట్ట‌వా, గిట్ట‌వా అన్నాడు ఒక శ‌త‌క‌క‌ర్త‌.

వారు మీ ప్రాధాన్య‌త‌లో ఉండాలి!

స్నేహితుల‌కు, ప్రేమికురాలికి, బంధువుల‌కు, ఆఫీసు వ్య‌క్తుల‌కు ప్రాధాన్య‌తా క్ర‌మాల‌ను ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇలాంటి ప్లానింగ్ లో త‌ల్లిదండ్రుల‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త ఎంతో స‌మీక్షించుకోవాలి. వారితో ఒక డిన్న‌ర్ ప్లాన్ చేసుకోవ‌డ‌మో, చిన్న టూర్ కు తీసుకెళ్ల‌డ‌మో.. వారికంటూ కొంత స‌మ‌యాన్ని కేటాయించ‌డ‌మో.. వారిని ఎంతో ఆనంద పెట్టే అంశ‌మ‌ని గ్ర‌హించాలి!

4 Replies to “మీరు మంచి పుత్రుడేనా? చెక్ చేసుకోండి!”

Comments are closed.