పార్టీని శాసిస్తున్న సోషల్ మీడియా

ఏదైనా మనకు ఉపయోగపడుతున్నంత వరకు బాగానే ఉంటుంది. బరువుగా మారితేనే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది

ఏదైనా మనకు ఉపయోగపడుతున్నంత వరకు బాగానే ఉంటుంది. బరువుగా మారితేనే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. కూటమి అధికారంలోకి రావడానికి ఆయా పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచిన సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా వరకు కారణం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నిస్వార్ధంగా అండగా నిలబడే బలమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా ఉన్నాయి. వీరు వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు బలంగా పోరాడారు. అయితే భాష, పోస్టుల వరకు వీలైనంత వరకు హద్దుల్లోనే ఉన్నారు. కాన్తో, కూస్తో బుర్రలో గుంజు ఉన్న హ్యాండిల్స్ ఇవి. అందుకే ఇవి బలమైన ప్రభావాన్ని చూపగలిగాయి.

సరే, ఇప్పుడు తెలుగుదేశం-జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలలా ఇవి కూడా రాజకీయ పార్టీలే. వాటి లక్షణాలే వీటికీ ఉంటాయి. పైగా కొత్తగా రాజకీయ నాయకులు చకచకా పుట్టుకువచ్చేయరు. ఇటు వాళ్లు అటు, అటు వాళ్లు ఇటు అన్నది కామన్. అధికారులు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వైపు తిరుగుతారు పొద్దు తిరుగుడు పూల మాదిరిగా. ఇది తరతరాలుగా వస్తున్నదే. రాజకీయ నాయకులు కూడా దీన్ని “కాదు” అనలేరు. ఎందుకంటే వ్యవహారాలు జరిపేవారు ప్రతి చోటా కొద్దిమందే ఉంటారు. వారినే చేరదీయాలి. బలమైన రాజకీయకులు ఉన్న చోట్ల తప్పిస్తే, చాలా వరకు రాజకీయ నాయకులు అంతా చెట్టాపట్టాలేసుకునే ఉంటారు.

ఇదే ఇప్పుడు కూటమి అనుకూల సోషల్ మీడియాకు మింగుడు పడడం లేదు. వైకాపా వాళ్లను కూటమి పార్టీల్లోకి తీసుకోవడం, వాళ్లకు పదవులు కట్టబెట్టడం, వాళ్లు ఈ ప్రభుత్వంలో కూడా హ్యాపీగా కాలర్ ఎగరేయడం చూస్తుంటే, సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు మండిపోతోంది. జీతానికి పని చేసే సోషల్ మీడియా విభాగం హ్యాండిల్స్ సైలెంట్‌గా ఉండవచ్చు. కానీ పార్టీ అభిమానం, కులం, ఇతరత్రా కారణాలతో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉండే హ్యాండిల్స్ అలా ఊరుకోవడం లేదు. భగ్గుమంటున్నాయి. నిర్మొహమాటంగా తిడుతున్నాయి. దుయ్యబడుతున్నాయి.

దీంతో పార్టీ కూడా వీటికి తలవంచక తప్పడం లేదు. ఇకపై కూటమి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే. ఎవరితో ఎలా చెట్టాపట్టాలు వేసుకున్నా ఓకే. కానీ బయటకు మాత్రం రానీయకూడదు. కనిపించకూడదు. దీన్నే మన పెద్దలు ఇంకోలా చెప్పారు: “మాంసం తినండి, కానీ ఎముకలు మెడలో వేసుకుని తిరగొద్దు” అని.

9 Replies to “పార్టీని శాసిస్తున్న సోషల్ మీడియా”

  1. టీడీపీ కాడర్, పచ్చ ఛానెల్స్ ధోరణి నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు విజయసాయి చంద్రబాబుని నానా తిట్లూ తిట్టాడు. కానీ తారకరత్న అంత్యక్రియలప్పుడు అతను, బాబు పక్క పక్కన కూచుని మాట్లాడుకున్నారు. టీడీపీ కాడర్‌కి తప్పు కనిపించలేదు. విజయసాయి జగన్‌కి ఝలక్ ఇవ్వబోతున్నాడు అని పచ్చ చానెల్స్ కథలు వండేసాయి కూడా. జగన్‌తో పాటు జైలు కెళ్లొచ్చిన మోపిదేవి టీడీపీలో చేరినా ఎవరూ కిక్కురు మనలేదు. కానీ ఇప్పుడు ఏదో కుల కార్యక్రమంలో జోగి రమేష్, టీడీపీ లీడర్స్ కలిస్తే అవే చానెల్స్, కాడర్ దుమ్మెత్తి పోస్తున్నారు. రేపు బాబుగారికి మనసు మారి జోగిని పార్టీలో చేర్చుకుంటే ఇదో పెద్ద రాజకీయ వ్యూహం అని ఏబీయన్ అనకుండా ఉంటుందా?

Comments are closed.