విశాఖ మంత్రి ఆయనేనట?

విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది.

విశాఖ జిల్లాకు మంత్రి లేకుండా మూడేళ్ళ కాలం గడచిపోయింది. వైసీపీ ప్రభుత్వం తొలి రెండున్నరేళ్ళు అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నారు. పునర్ వ్యవస్థీకరణలో ఆయనను తప్పించారు. అనకాపల్లి జిల్లాకే రెండు మంత్రి పదవులు ఇచ్చి, విశాఖను మంత్రి పదవిలేకుండా వదిలేశారు.

టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చాక, అనకాపల్లి జిల్లా నుంచి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రిగా అవకాశం దక్కింది. అంతేకాకుండా, హోం శాఖ వంటి కీలకమైన పదవి కూడా ఆమెకు అందింది. అయితే విశాఖ జిల్లాకు చెందిన ఎన్నో ఆశావహులు ప్రయత్నించినప్పటికీ, వారికి రిక్త హస్తమే మిగిలింది.

విశాఖ ఏపీలో మెగా సిటీగా ఉంది. ఒక విధంగా రాజధాని నగరంగానే చెప్పవచ్చు. అటువంటి విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్నారు. ఎట్టకేలకు ఆ లోటును గుర్తించిన టీడీపీ అధినాయకత్వం, విశాఖకు మంత్రి పదవిని కేటాయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విశాఖ నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. పల్లా 2024 ఎన్నికల్లో ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. 94 వేలకుపైగా మెజారిటీ పొందారు. ఆయనకు టీడీపీ ఏపీ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చారు. టీడీపీ సభ్యత్వం 70 లక్షలకు పైగా పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ అధినాయకత్వం ప్రశంసిస్తోంది. ఈ రికార్డును సాధించినందుకు పల్లాకు గిఫ్ట్‌గా మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో, పల్లాకు మంత్రివర్గంలో చోటు ఖాయమని అంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన పల్లా, గాజువాక నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. లోకేష్ యంగ్ టీమ్‌లో కీలక సభ్యులుగా ఉన్నారు.

విశాఖలో టీడీపీకి భవిష్యత్తు నాయకులుగా గుర్తింపు పొందిన వారిలో పల్లా ముందు వరుసలో ఉంటారు. పల్లాకు కీలకమైన శాఖలు ఇవ్వడం ద్వారా విశాఖ జిల్లాలో పార్టీ పట్టును మరింత బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. పల్లాకు మంత్రి పదవి ఇవ్వడం సహేతుకం, సమంజసమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

4 Replies to “విశాఖ మంత్రి ఆయనేనట?”

  1. ఏదీ కమిట్మెంట్ లేదు.. రాజధాని అంటావ్.. నెగ్లెక్ట్ చేస్తావ్.. అదీ నువ్వే అంటావ్.. ఇదీ నువ్వే అంటావ్.. ఇల్లు కట్టావ్.. దొబ్బెట్టావ్.. మళ్ళీ పాలస్ కట్టావ్.. నెగ్లెక్ట్ చేసావ్.. ఏంటో మనుషులు.. ఆ శా o తి స్వరూప్ ఏం చేసాడు

Comments are closed.