Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లి

“బచ్చల”కూరలాంటి రుచీ లేక, “మల్లి”లోని సువాసన పంచలేక నిట్టూర్చేలా చేసింది ఈ “బచ్చలమల్లి”.

చిత్రం: బచ్చల మల్లి
రేటింగ్: 2.25/5
తారాగణం: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రావు రమేష్, రోహిణి, అచ్యుత్ కుమార్, హరితేజ, వైవ హర్ష, ప్రవీణ్, అంకిత్ కొయ్య తదితరులు
కెమెరా: రిచర్డ్ నాథన్
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు: రాజేష్, బాలాజి
దర్శకత్వం: సుబ్బు మంగదీవి
విడుదల: 20 డిసెంబర్ 2024

అల్లరి నరేష్ తన సిగ్నేచర్ కామెడీ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సీరియస్ సినిమాలు చేసే పని ఎప్పుడో మొదలుపెట్టాడు. ఎన్ని చేసినా ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు “బచ్చలమల్లి” అంటూ రఫ్ అండ్ టఫ్ పాత్రతో ముందుకొచ్చాడు. ఎలా ఉందో చూద్దాం.

బచ్చలమల్లి(అల్లరి నరేష్) బాల్యంలో చదువులో స్టేట్ ర్యాంకర్. తండ్రంటే అతనికి ప్రాణం. కానీ ఆ తండ్రి మరొక స్త్రీతో సహజీవనం చేసి బిడ్డని కని ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి తండ్రంటే అసహ్యం పెంచుకుంటాడు మల్లి. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్నవాడల్లా పొగరుబోతు, తాగుబాతు, తిరుగుబోతుగా మారిపోతాడు. ఊళ్లో అతనికి మొండివాడైన మూర్ఖుడిగా గుర్తింపు. అనుకోకుండా ఒక పెళ్లిలో చూసిన కావేరిని (అమృత అయ్యర్) ఇష్టపడతాడు. ఆమె కోసం వ్యసనాలు వదిలేసి మారతాడు. ఒకానొక సందర్భంలో ఆమె తన తండ్రిని వదిలి అతనితో రానంటుంది. దాంతో మళ్లీ వ్యసనాలు మొదలుపెడ్తాడు. ఇదిలా ఉండగా ఊళ్లో రాజు (అచ్యుత్ కుమార్) గోని సంచుల వ్యాపారి. బచ్చలమల్లి తన వ్యాపారంలో ఎదగడం అతనికి ఇష్టముండదు. ఈ నేపథ్యంలో అతనికి ఈ రాజుతో గొడవ ఎటు తీసుకెళ్తుంది? కావేరీతో ప్రేమ మళ్లీ చిగురిస్తుందా? అతని జీవన గమనం ఏమౌతుంది అనేది కథ.

అసలీ కథలో ఏముందో అర్థం కాదు. హీరో పాత్రతో ఎమోషనల్ గా జర్నీ చేయడానికేం లేదు. అనవసరమైన కోపం, అతి మూర్ఖత్వం.. ఇదే అతని గ్రాఫ్. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండొచ్చు. కానీ సినిమాలో కథానాయకుడిగా పెట్టి చూసేయమంటే చిర్రెత్తుకొస్తుంది. హీరో పాత్ర నచ్చకపోతే సినిమా మొత్తం భారంగానే ఉంటుంది. ఇక్కడ హీరోలో అవలక్షణాలుండడం సమస్య కాదు. ఆ లక్షణాల చుట్టూ హీరోయిజం లేకపోవడమే ఈ కథలో సమస్య.

సినిమా మొదలైన మొదటి పది నిమిషాలు బచ్చలమల్లి తాగడం, నలుగురిని కొట్టడం.. అదేమన్నా కథకి పిచ్చింగ్ పాయింటా అంటే కాదు. జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఆ సన్నివేశం కథని ఏ మలుపూ తిప్పదు. అలాంటప్పుడు అంత టైం దానికి కేటాయించడం అనవసరమనిపిస్తుంది.

హీరోగారికి ఎప్పుడు ఎందుకు కోపమొస్తుందో అర్ధం కాదు. ఫైట్లకి కారణాలు కూడా పరమ పేలవంగా ఉన్నాయి. అసలిందులో చాలా సేపటి వరకు హుక్ పాయింటే కనపడదు. ఇంటర్వెల్ లో ఏదో పెద్ద కథ ఉందన్న టైపులో ఒక బ్లాక్ పెట్టినా, ద్వితీయార్ధంలో అది కాస్తా తేలిపోయింది. సరైన గ్రిప్ లేకుండా కథంతా నడిచాక చివర్లో తల్లిపాత్ర 1 నిమిషం డైలాగ్ చెప్పగానే బచ్చలమల్లిలో మార్పు వచ్చేస్తుంది. కావేరి తండ్రి కూడా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసేసానని ఎమోషనల్ గా డైలాగ్ చెప్పేస్తాడు. ఆ సీన్లన్నీ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి.

బచ్చలమల్లి పాత్రతో ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, అతనికి ఆకట్టుకునే క్యారెక్టరైజేషన్ లేకపోవడం, అలాంటి అయోగ్యుడికి హీరోయిన్ పడిపోవడం.. చివర్లో ఆమె తండ్రి పశ్చాత్తాపం చెందేయడం అన్నీ బలవంతంగా ఉన్నాయి తప్ప ఆర్గానిక్ గా అనిపించవు.

ఈ చిత్రంలో ప్రధానమైన ప్లస్ పాయింట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. విశాల్ చంద్రశేఖర్ తన పనితనం మొత్తాన్ని చూపించాడు. అయితే ఆ సౌండ్ ని పాటల మీద కూడా బాదేయడం వల్లనేమో లిరిక్ లో ఏదో సెన్స్ ఉందని అనిపిస్తున్నా ఆస్వాదించకుండా పోయాయి. ఒకటి రెండు పాటలు కాస్త పర్వాలేదనిపించాయి తప్ప హాంట్ చేసే రేంజులో లేవు. కెమెరా, ఎడిటింగ్ వగైరాలు ఓకే.

అల్లరి నరేష్ ఈ రఫ్ పాత్రలో అస్సలు కన్విన్సింగ్ గా లేడు. అతని ప్రయత్నాన్ని తప్పుబట్టలేం కానీ, ఇది తనకి నప్పదని తెలుసుకుంటే సరిపోయేది. పోనీ పాత్రకి తగ్గట్టుగా బాడీ మేకోవర్ జరిగిందా అంటే లేదు. అలాంటి బాడీతో ఆ రేంజ్ ఫైట్లు చేసేసి, అంత మొరటుగా పోలీసు లాఠీ దెబ్బలకి కూడా కదలకుండా ఉండే సీన్లలో ఎంత జీవిస్తున్నా నటిస్తున్నట్టే ఉంది తప్ప నమ్మశక్యంగా అనిపించదు.

అమృత అయ్యర్ “హనుమాన్” తర్వాత కనిపించింది. తన పాత్ర వరకు బానే చేసింది. ఉన్నంతలో హావభావాలు పలికించింది.

ప్రవీణ్-హరితేజ జంట ఉన్నా కూడా వాళ్ళని కామెడీ కోసం వాడుకోలేదు. ఆ ట్రాక్ కాస్త సరదాగా రాసుకున్నా రిలీఫ్ ఉండేదేమో. వైవా హర్ష కూడా తేలిపోయాడు. అంకిత్ కొయ్య పాత్ర ఎంట్రీ బానే ఉన్నా పేలవంగా ముగిసింది.

అచ్యుత్ కుమార్ క్యారెక్టర్ వల్ల ప్రధానకథకి పెద్ద ప్రయోజనమేం లేదు. రావు రమేష్ పర్ఫెక్ట్ చాయిస్. హీరో తండ్రిగా చేసిన కోట జయరాం ఓకే. రోహిణికి చివర్లో కాస్త డైలాగ్ చెప్పే సీనుంది.

చివరిగా చెప్పాలంటే.. అల్లరి నరేష్ మీద అభిమానమో, నమ్మకమో ఉన్నవాళ్లు అతని ప్రయత్నాలని సాధ్యమైనంత వరకు ఆదరించే ఆలోచనలో ఉంటారు. ఏ మాత్రం బాగున్నా మెచ్చుకుంటారు. ఇక్కడ కథ ఎంపిక, పాత్ర ఎన్నిక రెండు విషయాల్లోనూ పొరపాటు జరిగినట్టు అనిపించింది. అంచనాలు పెట్టుకుని చూసినా, పెట్టుకోకుండా వీక్షించినా ఆడియన్స్ కి పైసావసూల్ ఫీలింగైతే రాదు. కథ, కథనం, పాత్ర పాకానపడకుండా కంగారుగా దింపేసి ప్రేక్షకులకి వడ్డించేసినట్టు ఉంది. ఏ ఎమోషన్ కూడా గుండె లోతుల్ని తాకదు.

“బచ్చల”కూరలాంటి రుచీ లేక, “మల్లి”లోని సువాసన పంచలేక నిట్టూర్చేలా చేసింది ఈ “బచ్చలమల్లి”. ఇందులో అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే “ఎందుకు తీసినట్టు- ఏముందని తీసినట్టు?”! అనాలనిపిస్తుంది.

బాటం లైన్: నచ్చని మల్లి

15 Replies to “Bachhala Malli Review: మూవీ రివ్యూ: బచ్చల మల్లి”

  1. వైవా హర్ష కూడా తేలిపోయాడు అంటే, అతను గొప్ప నటుడు, అతనికి మంచి పాత్ర దొరకలేదనా?

    అతనికి బాగా అలవాటైన వెకిలి హావభావాలు, పనికిరాని డైలాగులు చెప్పడం… అవి ఈ సినిమాలో లేవని అర్థమా?

  2. అల్లరి నరేష్ తో సమస్య ఏంటంటే అతను సినిమాలు కొత్తగా తీస్తున్నాను అని చెప్తున్నాడు కానీ ఇలాంటి సినిమాలు పాత్రలు అతనికి కొత్తే కానీ ప్రేక్షకులకి ఇలాంటి పాత్రలు కథలు కొత్త కాదు అందుకే అతని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు

Comments are closed.