ప్రస్తుత రెవెన్యూ సదస్సులతో ఒరిగేదేమీ లేదని రెవెన్యూ అధికారులే అంటున్నారు. దీనికి కారణం, తహశీల్దార్ల చేతుల్లో పరిమితమైన అధికారాలు వుండడమే. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడు వరుసగా రెండేళ్లు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం, అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వడాన్ని రెవెన్యూ అధికారులు గుర్తు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేనే లేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు. వైసీపీ హయాంలో తహశీల్దార్ల అధికారాలకు కోత విధించారు. మ్యుటేషన్ తప్ప, మిగిలిన ఏ అధికారాలు ప్రస్తుతం తహశీల్దార్ల చేతుల్లో లేవు. కానీ కూటమి సర్కార్ ప్రజల్లో పాలన సాగుతోందన్న అభిప్రాయాన్ని కలిగించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి తహశీల్దార్లపై ఒత్తిడి ఉన్నట్టు తెలిసింది. అయితే తక్షణం చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, ప్రతిదీ విజయవాడ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ సమస్యల్ని తక్షణం పరిష్కరించాలనే ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, అధికారాలు లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరని తహశీల్దార్లు ప్రశ్నిస్తున్నారు. కావున వైసీపీ హయాంలో తొలగించిన అధికారాల్ని తిరిగి పునరుద్ధరిస్తే తప్ప, ఏమీ చేయలేమని అంటున్నారు.
తహశీల్దార్థ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాల్ని కూడా జేసీ, కలెక్టర్లకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో ప్రతిదీ జిల్లా లేదా రాష్ట్రస్థాయికి వెళ్లి పరిష్కారానికి నోచుకోవాలంటే చాలా సమయం పడుతోంది. రెవెన్యూ సమస్యలు తక్షణం పరిష్కారం కాకపోవడానికి ఇబ్బంది ఎక్కడో ప్రభుత్వం గుర్తించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది.