పవన్‌కల్యాణ్ ఊగిపోతూ ప్రసంగించడంపై ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్ హావభావాలపై చర్చ జరుగుతోంది. ఆక్రోశం, ఆవేదన కలిగితే ఊగిపోతారని సీఎం జగన్‌కు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ఊగడంపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్స్ విసిరారు.
సాధారణంగా తాగిన వాళ్లు మాత్రమే ఊగాలి, వాగాలి అని అన్నారు. కానీ పవన్‌కల్యాణ్ ఎందుకలా ఊగుతున్నారని సురేష్ ప్రశ్నించారు. ‘నేను ఎవ్వరినైనా ఏమైనా తిట్టొచ్చు, ఎవ్వరూ నన్ను ఏమీ అనకూడదు’ అనే రీతిలో పవన్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. పవన్ ఊగిపోతూ ప్రత్యర్థుల్ని తిడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు బానిసత్వంలో ఎలాంటి అలసట లేకుండా పవన్ పని చేస్తున్నారని విమర్శించారు.
గాజువాక, భీమవరం రెండు చోట్ల చంద్రబాబు చెప్పినట్టు పోటీ చేశారని.. అందుకే రెండు చోట్ల పనన్ను ఓడించారన్నారు. పవన్ తాను మాత్రమే సత్యహరిశ్చంద్రుడని అనుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పాలే తప్ప, ఆవేశం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 2014లో కలిసి ఉన్న మీ మధ్య 2019కి వచ్చే సరికి ఎందుకు చెడిందని నందిగం సురేష్ నిలదీశారు.
జగన్‌ను ఎదుర్కోవడం కోసం అప్పుడు వేర్వేరు తలలు పెట్టుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వమంటూ మళ్లీ ఏకమవుతున్నారని సురేష్ విమర్శించారు. ఎవరు ఏకమై వచ్చినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని, జగనే సీఎం అవుతారని ఆయన తేల్చి చెప్పారు.