ఎన్నికలు దగ్గర పడే కొద్ది రకరకాల సర్వే ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 2024 లోక్ సభ ఎన్నికలపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ‘జన్ గన్ కామన్’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీ భారీ విజయాన్ని సాధిస్తుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాలు చూస్తే సీఎం జగన్ చెప్పినట్లు వై నాట్ 175 కు దగ్గర్లో ఉన్నాయి.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ 24 నుండి 25 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలుస్తుందని వెల్లడించింది. వైసీపీ తర్వాత టీఎంసీ 20-22 సీట్లు, బీజేడీ 12-14, బీఆర్ఎస్ 9-11 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 29.20 శాతం, బీజేపీ 25.30 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలినట్లు పేర్కొంది.
ఇక కేంద్రంలో బీజేపీ+ పార్టీలకు 285-325, కాంగ్రెస్+ పార్టీలకు 111-149 సీట్లు వస్తాయని వెల్లడించింది. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ దేశం మొత్తం తిరిగిన కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాభం లేనట్లుగానే అంచనాలు ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలలు కాలం ఉండటం పాటు.. సాధారణ ఎన్నికల ముందుగా జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం.. తగ్గడం అనేది అధారపడుతుంది.
కాగా ఏ సర్వే అయినా కొంతమందిని ప్రామాణికంగా తీసుకుని మాత్రమే సర్వే చేసి ఫలితాలు వెల్లడిస్తారనే విషయం తెలిసిందే. కొన్ని సార్లు వారి అంచనాలు కరెక్ట్ కావచ్చు.. అంచనాలు తప్పచ్చు. తుది ఫలితాలు అనేది ఎన్నికల తర్వాత ప్రజాక్షేత్రంలో ఎవరు ఎన్నికైతే వారిదే ఫలితం. అప్పటి వరకు ఇలాంటి సర్వేలను నమ్మేవారు నమ్ముతారు.. నమ్మనివారు నమ్మారు.