తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు ఊపు వచ్చింది. కర్నాటకను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్, తన పొరుగునే ఉన్న తెలంగాణలో పాగా వేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. కర్నాటకలో విజయ ప్రభావం తెలంగాణపై చూపుతోంది. అయితే ఇది అధికారాన్ని తీసుకొచ్చేంతగా వుందా? అంటే…కాలం జవాబు చెప్పాల్సిందే. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఆదివారం నిర్వహించనున్న సభలో రాహుల్ నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు చేరనున్నారు.
బీఆర్ఎస్లో పొంగులేటి బాగానే చీలిక తెస్తున్నారని సమాచారం. తాజాగా కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు కూడా పయనించేందుకు సిద్ధమయ్యారు. సత్తుపల్లిలో ముగ్గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి , పొంగులేటితో కలిసి అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. జెడ్పీ చైర్మన్ స్థాయి నాయకుడు పదవిని కాదనుకుని కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం, తెలంగాణలో ఆ పార్టీకి పాజిటివ్ సంకేతానికి నిదర్శనం.
ఖమ్మం సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఖమ్మం సభను అట్టర్ ప్లాప్ చేసేందుకు అధికార పార్టీ అన్ని రకాలుగా అడ్డుకుంటోందని పొంగులేటి విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. అలాగే ఖమ్మంలో సభను పురస్కరించుకుని కనీసం మంచినీటిని కూడా సరఫరా చేయవద్దని ఆదేశిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుతుందనేందుకు ఈ అడ్డంకులే ఉదాహరణ అని ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇంతకాలం కాంగ్రెస్‌కు బదులుగా బీజేపీని బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా భావించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది.