రాజకీయంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని కూటమి నేతలు వేధించడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్లంతా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. కానీ కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తే రెవెన్యూ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అలాగని బయటికి అందరూ చెప్పుకోలేకపోతున్నారు. లోలోపల కుమిలిపోతున్నారు.
ఆ మధ్య మదనపల్లె నియోజకవర్గంలోని ఒక మహిళా తహశీల్దార్ ప్రతి నెలా ఎమ్మెల్యేకు రూ.30 లక్షలు ఇవ్వాలని డెడ్‌లైన్ పెట్టారని, ఇవ్వకపోవడంతో వేధిస్తున్నారని ఏకంగా మంత్రి నారా లోకేశ్‌కు రాతమూలకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం నియోజకవర్గాల్లో వుందని సమాచారం.
పోస్టింగ్‌కు డబ్బు తీసుకోవడం మొదలు, వివాదాస్పద భూముల వివరాలు తమకు తెలియజేసి, ఆర్థికంగా సంపాదించుకోడానికి సహకరించాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్, ఆర్డీవీలపై ప్రజాప్రతినిధుల నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ఎక్కువ వున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జేసీ, కలెక్టర్లపై కూడా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, కిందిస్థాయి అధికారులపై ఉన్నంతగా కాదు.
కనీస మర్యాద లేకుండా తహశీల్దార్లు, ఆర్డీవోలపై కూటమి ప్రజాప్రతినిధులు పెత్తనం చెలాయిస్తున్నట్టు సమాచారం. ఇలాగైతే మిమ్మల్ని ఏరికోరి ఎందుకు తెచ్చుకున్నామని తహశీల్దార్లు, ఆర్డీవోలను కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు దబాయిస్తున్నారని తెలిసింది. ఇలాగైతే ఉద్యోగాలు చేయలేమని రెవెన్యూ ఉద్యోగులు వాపోతున్నారు.