ఆంధ్ర శ్రీలంకలా మారిపోతోందని బాబు అన్నారు. తెలుగు ప్రజలకు జాగ్రఫీ నేర్పాలనే ఆయన తాపత్రయం మెచ్చుకోదగ్గది. దునియాలో ఎక్కడెక్కడి పేర్లో వల్లించి, వాటి గురించి మనకు ఎఱిక కల్పిస్తారు. తను సిఎంగా వుండే రోజుల్లో ఓ రోజు అమరావతిని అమ్‌స్టర్‌డామ్‌ను చేస్తాననేవారు, ఇంకో రోజు అజర్‌బైజాన్ చేస్తాననేవారు, మరో రోజు అంగోలా లేదా ఇస్తాంబుల్ చేస్తాననేవారు. అది దేశమో, నగరమో మనకు తెలిసేది కాదు. ఎప్పటిదో కానీ ఓ వీడియో ఈ మధ్యే చూశాను. బాబు ఎబిఎన్ రాధాకృష్ణకి హిస్టరీ చెప్తున్నారు- ‘తెలంగాణలో నేనే ఎలిమెంటరీ స్కూలు నుంచి ప్రారంభించి, ఫస్ట్ టైమ్ తెలంగాణలో ఎడ్యుకేషన్ ప్రారంభించాను, నేనే డెవలప్ చేశాను…’ అని. మరి ఆంధ్రప్రజలకు కూడా జాగ్రఫీ పాఠాలు మధ్యలో మానేస్తే ఎలా అని పదవి పోయినా ఆ పాఠాలు కొనసాగిస్తున్నారు, మరోలా!
ఇప్పుడు ఉగాండాలో ఊచకోత జరిగిందనుకోండి, వెంటనే ఆంధ్రలో అచ్చు ఉగాండాలాగానే టిడిపి కార్యకర్తల ఊచకోత జరుగుతోంది అంటారు. వెనిజువెలాలలో ప్రజలు తిరుగుబాటు చేసి దేశాధ్యక్షుణ్ని దింపినట్లే, ఆంధ్రప్రజలు తిరగబడి, జగన్‌ను గద్దె దించే రోజు వస్తోంది అంటారు. గ్రీసు దివాళా తీసినట్లే ఆంధ్ర కూడా దివాళా తీస్తోంది అంటారు. ఇప్పుడు శ్రీలంకలా ధరలు పెరిగిపోయి, ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అంటున్నారు. శ్రీలంక దేశం, ఆంధ్ర అనేది రాష్ట్రం. ధరల పెరుగుదలలో కేంద్రం పాత్ర ఎక్కువగా ఉంటుంది అనే అంశమే ఆయన పట్టించుకోరు. మనకు పాఠం చెప్పానా లేదా అన్నదే ఆయన చూసుకుంటారు. దీని కారణంగా శ్రీలంక గొడవేమిటి, మనం కాస్త తెలుసుకోవాలి అని మనలో ఆసక్తి రగిలించారు కదా. అందుకు ఆయన్ని అభినందించాలి. ఇక శ్రీలంక గురించి ఎలాగూ వివరంగా చెప్తాను కానీ మొదట పోలిక ఎంతవరకు కరక్టో సూక్ష్మంగా చెప్పేస్తాను.
ఆంధ్ర ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ బాగా లేదన్నది గోడ మీది రాతంత స్పష్టం. జీతాలివ్వడానికి, బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోయినా సంక్షేమ పథకాలపై డబ్బు గుమ్మరిస్తూనే ఉన్నారు. ఆదాయం కంటె ఖర్చు ఎక్కువ. తక్కిన విషయాల్లో జగన్‌ను తిట్టినా, తిట్టకపోయినా ఆర్థిక వ్యవహారాల విషయంలో తప్పుపట్టి తీరాల్సిందే. బాబు ఐదేళ్లలో చేసిన అప్పు యితను సగం టైములోనే చేసేశాడు. ఆర్థికమే కీలకమైనది కాబట్టి, జగన్‌ను చేతకాని ముఖ్యమంత్రి అనవలసినదే! అయితే జగన్ అదృష్టమేమిటంటే ప్రత్యామ్నాయంగా ఉన్న బాబు పాలనను ప్రజలు ఐదేళ్లపాటు రుచి చూసేశారు. 2014లో ఋణమాఫీ అనే ఒక్క అబద్ధం ఆడలేక పోయినా కాస్తలో ఓడిపోయాను.. అని జగన్ వగచాడు కానీ నిజానికి అది అతనికి కలిసి వచ్చింది. ఇదే పాలన 2014లో ప్రారంభమై వుంటే, ‘అనుభవజ్ఞుడైన బాబును కాదని, అనుభవశూన్యుడైన జగన్‌కు అవకాశమిచ్చి తప్పు చేశాం’ అనుకుని జనాలు ఇంకో 15 ఏళ్ల దాకా అతనివైపు చూసేవారే కాదు.
బాబు నెగ్గి, అమరావతి అనే బండరాయిని నెత్తిన వేసుకుని, పోలవరం అనే గుదిబండను మెడకు తగిలించుకుని, జన్మభూమి కమిటీలనే బందాలను కాళ్లకు తగిలించుకుని ఏవీ చేయలేకపోవడంతో ప్రజలకు మనసు విరిగిపోయింది. ఎంతలా విరిగిపోయిందంటే స్థానిక ఎన్నికలలో కూడా టిడిపికి సీట్లు రాలేదు. 2024లో జగన్ 100 సీట్లు గెలిస్తే దానికి కారణం టినా ఫ్యాక్టరే (ప్రత్యామ్నాయం లేదు) తప్ప అతని సొంత ప్రతిభ కాదు. అయితే ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్యూర్ కారణంగా శ్రీలంకకు, ఆంధ్రకు పోలిక తెద్దామంటే కుదరదు. ఎందుకంటే శ్రీలంకలో అంతర్యుద్ధం, జాతివైరం, టెర్రరిజం, ఎగుమతి- దిగుమతుల మధ్య తేడా, వ్యవసాయోత్పత్తుల్లో పతనం, మితమీరి కరెన్సీ ముద్రించడం, టూరిజం ఆదాయం పడిపోవడం, విదేశీ మారకద్రవ్యంలో లోటు వంటి అనేక సమస్యలున్నాయి. ఇవన్నీ కేంద్రం పరిధిలోకి వచ్చే అంశాలు. పైగా శ్రీలంక జనాభా ఆంధ్ర జనాభాలో సగం కంటె తక్కువ.
అయితే శ్రీలంక పాలకుల ఆలోచనాధోరణితో పోలిక తేవాలంటే వారిది బాబు ధోరణే. నా ఉద్దేశంలో బాబుది ‘అప్పుచేసి పప్పుకూడు’ పాలసీ కాగా జగన్‌ది ‘అప్పుచేసి పప్పుబెల్లాల’ పాలసీ. బాహర్ షేర్వాణీ అన్నట్లుగా, అప్పు చేసైనా దర్జాగా, డాబుగా కనబడాలని బాబు తాపత్రయం. జేబులో లేకపోతే అప్పు చేసైనా పదిమందికి పంచిపెట్టేసి, శభాషనిపించుకోవాలని జగన్ ఆతృత. ఎన్టీయార్ సంక్షేమపథకాల బాట పొరబాటంటూ, కఠిన షరతులతో కూడిన అప్పులు తెచ్చి ఆర్భాటం చేసి ప్రపంచబ్యాంకు చేత శభాషనిపించుకున్న చరిత్ర బాబుది. శ్రీలంక పాలకులదీ అదే పద్ధతి. అమరావతి అనే అద్భుతనగరాన్ని సింగపూరు అప్పుతో కట్టేస్తే అదే బంగారు గుడ్లు పెట్టేసి రాష్ట్రం మొత్తాన్ని పోషించేస్తుందని కబుర్లు చెప్పి నమ్మించిన ఘనుడు బాబు. రాజపక్సలు, వారి వారసులు కూడా యిదే లాజిక్ చెప్పి చైనా నుంచి భారీ ఋణాలు తెచ్చి, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు కట్టించి దేశాన్ని ముంచేశారు. వాటి మీద యిప్పటిదాకా నిర్వహణ ఖర్చుకు సరిపోయే ఆదాయం కూడా రావటం లేదు. ఇక అప్పులెలా తీరుస్తారు? ప్రజలు ‘గోటా, గో హోమ్’ నినాదాలు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ అమరావతి ఆవిర్భవించలేదు కానీ లేకపోతే రాష్ట్రప్రజలు, ‘బాబోయ్ బాబూ, వెళ్లిరా బాబూ’ అని హోరెత్తించేవారు.
శ్రీలంక చిన్న దేశం. మనలాగే పరతంత్ర పాలనలో మగ్గి 1948లో స్వాతంత్ర్యం తెచ్చుకుంది. మనదేశాన్ని హిందూ, ముస్లింల మధ్య విభజించి పాలించినట్లే ఇంగ్లీషు వాళ్లు లంకను హిందూ తమిళ, బౌద్ధ సింహళ జాతుల మధ్య విభజించి పాలించారు. స్వాతంత్ర్యానంతరం మనదేశంలో రాజకీయ అస్థిరత లేకుండా చాలా దశాబ్దాలు గడిచాయి. కానీ లంకలో అతి త్వరలోనే అస్థిరత ఏర్పడింది. నిరంతర ఘర్షణలే. దానికి ఆదాయం వచ్చే మార్గం, టీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, దుస్తుల ఎగుమతి ప్లస్ టూరిజం! వ్యవసాయం, యితర ఉత్పాదకరంగం తక్కువే. ఆహారధాన్యాలు, వస్తువులు దిగుమతి చేసుకోవాలి. ప్రధాని సిరిమావో బండారు నాయకే కాలం వరకు మనదేశంలో అప్పుడున్నట్లే నియంత్రిత ఆర్థికవిధానం నడిచేది. ఫారెక్స్ నిల్వలు ఎక్కువ లేవు కాబట్టి, దిగుమతులపై ఆంక్షలుండేవి. దేశీయంగా ఉత్పత్తి పెంచండి, లేకపోతే నాశనమై పోతాం (ప్రొడ్యూస్ ఆర్ పెరిష్) అని సిరిమావో పిలుపు నిచ్చింది.
అది లంక ప్రజలకు నచ్చలేదు. 1977 ఎన్నికలలో ఆమెను ఓడించి, స్వేచ్ఛావాణిజ్యాన్ని ప్రోత్సహిస్తానని వాగ్దానం చేసిన జయవర్ధనేను అధ్యక్షుడిగా గెలిపించారు. రాజీవ్, పివి హయాంలో మన దేశంలో జరిగిన పనులు లంకలో 1977లోనే ప్రారంభమై పోయాయి. అన్నీ దిగుమతి చేసుకోవడమే. ఉత్పాదకరంగాన్ని నిర్లక్ష్యం చేయడమే! ప్రయివేటు సెక్టార్, విదేశీవ్యాపారం, విదేశీ పెట్టుబడులు… ఓహ్, అంతా రంగుల కల! ప్రగతిమార్గంలో లంక దూసుకుపోతోంది అంటూ ప్రపంచబ్యాంకు, పాశ్చాత్యదేశాల మెప్పులే మెప్పులు. భళా అంటే భళా అనుకుంటూ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే మార్గాన వెళ్లాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలోని పెట్టుబడులు యితర దేశాలకు మళ్లిపోవడంతో, పైగా 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం రావడంతో విదేశీ నిల్వలు తరిగిపోయి, రాజపక్స ప్రభుత్వం 2009లో ఐఎంఎఫ్ నుంచి 2.6 బిలియన్ డాలర్లు ఋణం తీసుకుంది. అయితే 2011 కల్లా బజెట్ లోటు 5%కు తగ్గించాలి అని షరతు పెట్టింది ఐఎంఎఫ్.
కానీ ఎగుమతులు పెరగలేదు, దిగుమతులు తగ్గలేదు. దాంతో 2015లో అధికారంలోకి వచ్చిన సిరిసేన యుఎన్‌పి ప్రభుత్వం మళ్లీ ఐఎంఎఫ్‌ను ఋణం అర్థించింది. 2016-19కు గాను 1.5 బిలియన్ డాలర్ల ఋణం యిస్తూ బజెట్ లోటు 2020 కల్లా 3.5% కావాలి అనే షరతు పెట్టింది. దానితో పాటు యింకా అనేక షరతులు పెట్టింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని, పబ్లిక్ సంస్థలను విక్రయించాలని, పన్నుల విధానాన్ని మార్చాలని… యిలా! ఈ ఋణాలు తీసుకున్నా లంక పరిస్థితి ఏ మాత్రం బాగుపడలేదు. 2015-19 మధ్యలో జిడిపి గ్రోత్ రేట్ 5% నుంచి 2.9%కు ఇన్వెస్ట్‌మెంట్ రేట్ 31.2% నుంచి 26.8%కు, సేవింగ్స్ రేట్ 28.8% నుంచి 24.6%కు, జిడిపిలో ప్రభుత్వాదాయం వాటా 14.1% నుంచి 12.6%కు తగ్గాయి. కాగా ప్రభుత్వ ఋణం జిడిపిలో 78.5% నుంచి 86.8%కు పెరిగింది.
ఇదంతా యిప్పుడు ప్రతిపక్షంలో ఉన్న యుఎన్‌పి ప్రభుత్వహయాంలో. 2019లో అధికారంలో వచ్చిన రాజపక్స ఎస్‌ఎల్‌పిపి ప్రభుత్వం యిదే బాటలో మరింత జోరుగా నడిచి, మరీ దిక్కుమాలిన పరిస్థితిని తీసుకువచ్చింది. 2019లో పబ్లిక్ డెట్-జిడిపి నిష్పత్తి 94% ఉంటే యిప్పుడది 119% అయింది. రాజపక్సలను యింటికి పంపించడంతో సమస్య తీరదు, ప్రభుత్వ విధానాలే మారాలని మనం గ్రహించాలి. ఐఎంఎఫ్ అప్పులిచ్చేటప్పుడు ‘ఋణాలిస్తాం కానీ మీరు సంక్షేమ పథకాలను తగ్గించాలి’ అంది. ప్రభుత్వవైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఓటర్లను ఆకర్షించడానికి అలాటి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే కష్టం కదా! అందువలన ప్రపంచ బ్యాంకు ఋణాలు వద్దని, ఎక్కువ వడ్డీ రేటుకి దేశాల నుంచి అప్పులు తెచ్చారు. వాటికి వడ్డీలు కట్టారు. వాటి ఫలితమే యిలా కుప్పకూలడం!
లంక సంక్షోభం తర్వాత చైనా లంకను ఎలా దోచిసిందో వివరిస్తూ వాట్సాప్‌లు వచ్చి పడుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే చైనా కంపెనీ వాళ్లు వచ్చి ‘మీరు రేవులు, స్థలాలు మాకు చూపిస్తే చాలు, మేమే వచ్చి మా డబ్బుతో మీకు కళ్లు చెదిరేలా అద్భుతనగరాలు, పోర్టులు, ఎయిరుపోర్టులు, హైవేలు, భవంతులు కట్టి పెట్టేస్తాం. మీరేమీ పెట్టుబడి పెట్టనక్కరలేదు, మేమే అంతా ఋణంగా యిస్తాం’ అన్నారు. ఆ నగరాలు చూపించి, ఇదంతా మా ప్రజ్ఞే అని ఓటర్లను మురిపించవచ్చు కదాని లంక పాలకులు సరేనన్నారు. వాళ్లు కట్టారు. వీళ్లు కొన్నేళ్లు వడ్డీలు కట్టి, యిప్పుడు కట్టలేక చేతులెత్తేశారు. కట్టలేదు కాబట్టి యిప్పుడు చైనా కంపెనీ వాళ్లు స్వాధీనం చేసేసుకుంటారు. ఆ భూమంతా లంకకు క్షవరం. అవి వాడుకున్నందుకు గాను చైనా కంపెనీలకు వీళ్లు రుసుము కడుతూ పోవాలి. ఈ ప్రతిపాదన వింటే మీకు అమరావతి-సింగపూరు ప్రతిపాదన గుర్తుకు వచ్చింది కదూ! అదే డెట్ ట్రాప్! ఋణజాలం. చైనా యీ ఫార్ములాను అనేక దేశాల్లో విజయవంతంగా ప్రయోగించింది.
లంక చైనా నుంచి కరోనా సమయంలో తీసుకున్న 2.8 బిలియన్ డాలర్ల ఋణానికి తోడు యిప్పుడు అత్యవసర ఋణంగా 2.5 బిలియన్ డాలర్లు తీసుకుంది. అంతే కాదు, ఇండియా నుంచీ భారీగా ఋణాలు తీసుకుంది. ప్రస్తుతం ఇండియా 2.4 బిలియన్ డాలర్ల అత్యవసర ఋణం యిచ్చింది. లంక ప్రభుత్వ ఋణాల్లో 14% చైనా నుంచి కాగా, 36% అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్ నుంచి! ఒక దశాబ్ద కాలంలో జిడిపి మూడు రెట్లు పెరిగింది అని వీళ్లు చంకలు గుద్దుకోవడం, ఔనౌను అంటూ ప్రపంచ బ్యాంకు ఖితాబు యివ్వడం జరిగింది కానీ, అదే సమయంలో విదేశీ ఋణం మూడు రెట్లు పెరిగిన విషయాన్ని దాచిపెట్టారు. ప్రస్తుతం అది 51 బిలియన్ డాలర్లయింది. వడ్డీ చెల్లింపులకే యీ ఏడాది 7 బిలియన్ డాలర్లు అవసరమౌతాయి. రాజపక్సలు అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో విదేశీ మారక ద్రవ్యం 70% కరిగిపోయి, ప్రస్తుతం 2 బిలియన్ డాలర్ల లోపుకి చేరింది.
ఈ ఋణాలు తీర్చాలంటే ఆదాయం పెరగాలి, ఎగుమతులు పెరిగి, విదేశీ నిల్వలు పెంచుకోవాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 2009 వరకు ఎల్‌టిటిఇని అణచడానికి లంక చాలా డబ్బే ఖర్చుపెట్టింది. ఆ తర్వాత అంతర్యుద్ధంలో ధ్వంసమై పోయిన తూర్పు, ఉత్తర ప్రాంతాలలో పునర్నిర్మాణానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంత చేసినా 2019 ఏప్రిల్‌లో రాజధాని కొలంబోలో ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో జరిగిన బాంబు దాడుల్లో 250 మంది చనిపోవడంతో టూరిస్టులు బెదిరిపోయారు. 2018లో 20 లక్షల మంది టూరిస్టులు వస్తే, ఆ తర్వాత ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. పులి మీద పుట్రలా కరోనా వచ్చింది. వీళ్ల టూరిస్టులలో రష్యన్లు, ఉక్రెయిన్లు ఎక్కువ. కొద్ది నెలలుగా వాళ్ల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా వాళ్లు రావడం మానేశారు. ఆ నష్టానికి తోడు లంకకు కావలసిన వంట నూనె, పెట్రోలు ఆ దేశాల నుంచే రావాలి. వాళ్ల యుద్ధం కారణంగా అవి ఆగిపోయాయి.
విదేశాలలో కార్మికులుగా ఉన్న ప్రవాస లంకేయుల ద్వారా లంకకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా ఉంటుంది. కరోనా కారణంగా వ్యాపారం తగ్గి పశ్చిమాసియా దేశాలలో వీళ్ల ఉద్యోగాలు తీసేసి, యింటికి పంపించేశారు. వాళ్ల నుంచి వచ్చే విదేశీ ద్రవ్యమూ పోయింది. విదేశాల మార్కెట్ పడిపోవడంతో లంక నుంచి వెళ్లే ఎగుమతులు తగ్గిపోయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దేశంలో లాక్‌డౌన్ కారణంగా కూడా పరిశ్రమలు, షాపులు మూతపడి, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు తగ్గిపోయాయి. 2020లో జిడిపి 3.6% కుంచించుకుపోయింది. 2013 లో వచ్చిన గ్లోబల్ ఆర్థిక సంక్షోభం కారణంగా టీ, రబ్బరు యిత్యాదుల రేట్లు పడిపోయి, ఎగుమతులపై ఆదాయం తగ్గిపోయింది. కానీ దిగుమతులు పెరుగుతూ పోయాయి. 2021లో ఇంపోర్టు బిల్లు 20 బిలియన్ డాలర్లకు చేరింది. విదేశీ ఋణం 7 బిలియన్ డాలర్లయింది.
ఎరువుల సబ్సిడీపై లంక ప్రభుత్వం ఏటా 260 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఎరువుల్లో చాలా భాగం దిగుమతి చేసుకునేవే. తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వలు ఆదా చేయాలని గోటా దిగుమతి చేసుకున్నవే కాక, ఏ ఎరువునూ వాడకుండా చేద్దామని చూశాడు. ఉట్టినే ఆపితే బాగుండదని రైతులందరూ పర్యావరణానికి అనుకూలంగా వుండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి అంటూ 2021 మేలో చట్టం చేశాడు. సేంద్రియ వ్యవసాయంలో లంక రైతులకు అనుభవం లేదు కాబట్టి, దిగుబడి తగ్గిపోతుంది జాగ్రత్త అని నిపుణులు హెచ్చరించినా గోటా వినలేదు. చివరకు అదే జరిగింది. టీ ఉత్పత్తి 35%, వరి దిగుబడి 25%, కొబ్బరికాయ దిగుబడి 30% తగ్గాయి. ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. ఇండియా, మయన్మార్, చైనాల నుంచి బియ్యం దిగుమతి చేసుకోవలసి వచ్చింది. విదేశీ మారక నిల్వలు ఆదా కాకపోగా, యింకా ఎక్కువ ఖర్చయ్యాయి. చివరకు నవంబరులో గోటా దాన్ని రద్దు చేశాడు కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు అన్నిటికీ కరువే.
ఓటర్లలో కొన్ని వర్గాలకు మేలు చేస్తే మన విజయానికి ఢోకా ఉండదనే ప్రణాళికతో పాలకులు అతి చేసేస్తారు. పోలింగు సమయంలో అక్కరకు వస్తారని, బాబు ఉద్యోగులకు దోచి పెట్టారు. హైదరాబాదు నుంచి తీసుకెళ్లిన సెక్రటేరియట్ వాళ్లకు యిచ్చిన సౌకర్యాలు అన్నీయిన్నీ కావు. ఇక జగన్ పాదయాత్రలో నోటికి వచ్చినట్లు వాగ్దానాలు చేశారు. ఇప్పుడడిగితే ‘లెక్కలు సరిగ్గా చూసుకోకుండా హామీలిచ్చేశా’ అంటున్నారు. ‘ఆ ముక్క లెక్కెట్టుకునే ముందు చెప్పాల’ అన్నట్లు ఇలాటివన్నీ ముందే చూసుకోవాలి. ఇప్పటికైనా నాయకులందరూ హామీలను అంకెల్లో చెప్పకుండా బజెట్‌లో శాతంగా చెప్తే కన్‌ఫ్యూజన్ వుండదు. బజెట్‌లో 12% రైతులకు, 8% విద్యార్థులకు.. అంటూ చెప్తూ పోతే, మొత్తం నూరుకి దాటలేరు కదా!
చెప్పవచ్చేదేమిటంటే గోటా ఎన్నికలలో డబ్బున్న వర్గాల మద్దతుకోసం భారీగా ఇన్‌కమ్ టాక్స్ రాయితీలు, పన్ను రాయితీలు ప్రకటించాడు. గెలిచాక అమలు చేశాడు కూడా. వాట్ రేట్లను 15% నుంచి 8%కు తగ్గించాడు. గతంలో 1.20 కోట్ల రూ.ల కంటె పైన ఆదాయం ఉంటేనే వాట్ రిజిస్ట్రేషన్ చేయాలని రూలుంటే దాన్ని 30 కోట్లకు పెంచాడు. ఇన్‌కమ్ టాక్స్ విషయంలో 5 లక్షల రూ.ల లోపున ఉన్నవాళ్లకు పన్ను మినహాయింపు ఉంటే దాన్ని 30 లక్షలు చేశాడు. నేషనల్ బిల్డింగ్ టాక్స్, పిఎవైఇ టాక్స్, ఎకనమిక్ సర్వీస్ టాక్స్ చార్జిలు తీసేశాడు. దాంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో 33.5% మంది తగ్గిపోయారు. ఆదాయానికి గండి పడింది. జిఎస్టి, వాట్‌లపై ఆదాయం సగానికి సగం తగ్గిపోయింది.
ప్రస్తుత పరిస్థితి ఎలా వుందంటే, ద్రవ్యోల్బణం 17.5%కు చేరి 300 లంక రూపాయలు పెడితే తప్ప ఒక అమెరికన్ డాలరు రావటం లేదు. ధరలు విపరీతంగా పెరగడం చేత శ్రీలంక ప్రజలు పడుతున్న గోడు గురించి మన పత్రికలు, టీవీలు విస్తారంగా కవర్ చేశాయి కాబట్టి వాటి గురించి రాయటం లేదు. గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగాయి. ఆర్థిక మంతిగా ఉన్న తన తమ్ముడు బాసిల్‌ను తీసేసి మరొకర్ని వేస్తే అతను 24 గంటల్లో దిగిపోయాడు. ఆ తర్వాత యావత్తు కాబినెట్ రాజీనామా చేసింది. రిజర్వ్ బ్యాంకు గవర్నరు రాజీనామా చేశాడు. ప్రభుత్వంలో చేరాల్సిందిగా గోటా ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాసను కోరితే అతను చేరనన్నాడు. లంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులుంటే 2020 ఎన్నికలలో అధికార కూటమికి 150 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు 41 మంది సభ్యులు ఎదురు తిరిగారనే అనుమానం ఉంది. అయినా సింపుల్ మెజారిటీ ఉంది. పోనుపోను ఏమౌతుందో చూడాలి. (ఫోటో- అధ్యక్షభవనం ముందు నిరసన ప్రదర్శనలు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)