బీజేపీ లాంటి పార్టీలలో అంతా ఒక్క మాట మీద ఉంటారు. అక్కడ రెండో మాటకు అవకాశం లేదు. తేడా కలిగిన పార్టీ అని బీజేపీ గురించి చెప్పుకుంటారు. మిగిలిన పార్టీలకు భిన్నమైనది అన్నది కమలనాథుల ఆలోచన. క్రమశిక్షణకు మారు పేరుగా బీజేపీ ఉంటుంది.
అటువంటి బీజేపీలో కీలక నేత ఒకరు పార్టీ పెద్దల స్టాండ్‌కి వ్యతిరేకంగా మాట్లాడటం అన్నది ఒక డిస్కషన్ పాయింట్‌గా ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు కుమార్ రాజు బాహాటంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు. ఆయన కాంగ్రెస్ సీఎంగా ఉన్న సంగతి ఇక్కడ గమనార్హం.
ఆయన బెనిఫిట్ షోలను రద్దు చేయడం మంచి డెసిషన్ అని విష్ణు కుమార్ రాజు చెప్పడం పైగా తన పార్టీ వారికి అది రాజకీయ కోణంలో కనిపించినా తాను మాత్రం రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నట్లుగా మీడియా ముందు చెప్పడం అన్నది పార్టీలో కొంత చర్చకు తావిస్తోంది.
తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్టును అక్కడి విపక్షాలు ప్రభుత్వం చేసిన రాజకీయ తప్పిదంగా చూస్తున్నాయి. కేంద్ర స్థాయి బీజేపీ నేతలు కూడా ఇదే స్టాండ్ మీదున్నారు. అయితే విష్ణు కుమార్ రాజు మాత్రం రేవంత్ రెడ్డిదే రైట్ అంటూ మాట్లాడడమే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు. ఏపీ శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు. ఆయన ఈ విధంగా మీడియా ముందుకు రావడం ద్వారా బీజేపీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. దానితో పాటుగా తాను సొంతంగా అభిప్రాయం చెప్పాను అని అంటూ పార్టీని కాస్త ఇరుకున పెట్టారని తర్కించుకుంటున్నారు.
ఆయనలో ఏమైనా అసంతృప్తి ఉందా అన్నది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆయన సీనియర్ ఎమ్మెల్యేగా మంత్రి పదవిని ఆశించారు. అయితే ఆయనకు దక్కలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికే ఇచ్చారు. రెండో మంత్రి పదవి బీజేపీకి ఇవ్వాలన్నది కూడా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు. అవి కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని బయటకు చెప్పడం ద్వారా బీజేపీ తెలంగాణలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ ఇష్యూలో చేస్తున్న రాజకీయ పోరాటాన్ని కొంత పలుచన చేసినట్లుగా ఉందని అంటున్నారు.