బీజేపీలోకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన ఈ నెల 25న పార్టీలో చేరతారని బీజేపీ సీనియర్ నేతలు ప్రకటించారు.

వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలోకి చేరబోతున్నారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీ. మాతృసంస్థ అదే కాబట్టి మళ్లీ ఆ వైపుకే వెళ్తారు అనుకున్నారు. వైసీపీ నుంచి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి తరువాత ఆయన టీడీపీలో చేరేందుకే ప్రయత్నాలు చేశారని ప్రచారం సాగింది.

ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుని రావడానికి ఒక సీనియర్ టీడీపీ నేత కూడా తన వంతుగా సహకారం అందించారని చెప్పుకుంటారు. అయితే టీడీపీలో కొందరు సీనియర్లు బహిరంగంగా విశాఖ డెయిరీ మీద ఆరోపణలు చేశారు. జనసేనకు చెందిన ఒక కార్పొరేటర్ అయితే విశాఖ డెయిరీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలే నిర్వహించారు.

దాంతో సభా సంఘం ఏర్పాటు అయింది. ఈ క్రమంలో విశాఖ డెయిరీ చైర్మన్‌తో పాటు పదకొండు మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో ఆయన సైకిలెక్కేందుకే అనుకున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ కండువాను ఆయన కప్పుకుంటారని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన ఈ నెల 25న పార్టీలో చేరతారని బీజేపీ సీనియర్ నేతలు ప్రకటించారు.

బీజేపీ పట్ల ఆకర్షితులై ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నారని వారు అంటున్నారు. అయితే మొదట టీడీపీ, ఆ తరువాత జనసేనలో ప్రయత్నాలు చేసి ఎక్కడా కుదరకనే కొందరు నేతలు బీజేపీని ఎంచుకుంటున్నారని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇలాగే జరుగుతోంది.

కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అధికారంలో బీజేపీ పాలు పంచుకుంటోంది. దాంతో ఆ పార్టీ బలం అన్న దాని కంటే రాజకీయ అవసరమే కమలం గూటికి కీలక నేతలను చేర్చేలా చేస్తోందని అంటున్నారు. కూటమిలో ఆడారి చేరితే విశాఖ డెయిరీ మీద చర్యలు ఏ విధంగా తీసుకుంటారో అన్నది అంతా తర్కించుకుంటున్నారు.