త్వరలో (ఫిబ్రవరి) ఢిల్లీలో ఎన్నికలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం కోసం గట్టిగా ఢీకొంటున్నాయి. ఆప్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, బీజేపీ ఈ సారైనా దక్కించుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని పోరాడుతోంది.
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ ఉన్నప్పటికీ, ఢిల్లీలో మాత్రం ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తుండడం ఆసక్తికర పరిణామం. అయితే బీజేపీతో ఆప్ అధినేత కేజ్రీవాల్ పొలిటికల్ గేమ్ ఆడటంలో ఆరితేరారు. అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి, దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసిన కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేయడం తెలిసిందే. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వరకూ మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనని కేజ్రీవాల్ ప్రతినబూనారు.
తన స్థానంలో మంత్రిగా పనిచేస్తున్న అతిషిని నియమించి కేజ్రీవాల్ ఆశ్చర్యపరిచారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ బీజేపీతో క్రేజీ పొలిటికల్ గేమ్‌కు తెరలేపారు. త్వరలో ఢిల్లీ సీఎం అతిషీని ఏదో ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేస్తారని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తద్వారా బీజేపీని ఆత్మరక్షణలో పడేయాలనేది కేజ్రీవాల్ ఎత్తుగడ.
ఇటీవల సీఎం అతిషి సంజీవని యోజన, సమ్మాన్ యోజన పథకాలు ప్రవేశ పెట్టడంతో కొందరు వణుకుతున్నారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. అతిషికి మంచి పేరు వస్తుండడంతో ఆమెను జైల్లో వేయాలని అనుకుంటున్నారనేది ఆయన ఆరోపణ. అంతటితో కేజ్రీ ఆగలేదు. అంతకు ముందే తమ పార్టీ కీలక నేతల ఇళ్లలో కేంద్ర సంస్థల సోదాలు జరగొచ్చని బీజేపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టే గేమ్‌కు కేజ్రీ తెరలేపారు.