ఎన్ని తప్పులు చేసినా చంద్రబాబు తన వర్గాన్ని వెనకేసుకొస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి బాబు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారంలో మాత్రం ఎందుకో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పటివరకూ అఖిల ప్రియ గురించి చంద్రబాబు కానీ, ఇతర ఏ టీడీపీ నాయకుడు కానీ మాట్లాడలేదు.
కనీసం బెయిల్ పై బయటకొచ్చిన తర్వాత కూడా అఖిల ప్రియను పరామర్శించిన పాపాన పోలేదు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అమ్మాయి, అందునా ప్రస్తుతం గర్భవతి అంటున్నారు, అటు భర్త పరారీలో ఉన్నాడు, ఇటు కేసులు వెంటాడుతున్నాయి.
ఇలాంటి దశలో కనీసం జాలితో అయినా అఖిల ప్రియను పరామర్శించే బాధ్యత టీడీపీ అధినాయకత్వంపై లేదా? అలా పరామర్శిస్తే తనకొచ్చే లాభం గురించే చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారా..? ఆళ్లగడ్డలో పూర్తిగా మరో వర్గాన్ని ప్రోత్సహించేందుకే పొమ్మనలేక అఖిలకు పొగపెట్టారా? వీటన్నిటికీ సమాధానాలు త్వరలోనే బయటకు వస్తాయి.
నో అపాయింట్ మెంట్..
అఖిల ప్రియ రిమాండ్ లో ఉండగానే.. వారి కుటుంబ సభ్యులు సాయం కోసం చంద్రబాబుని కలిశారు. అయితే కనీసం మాట సాయం చేయడానికి కూడా ఆయన ససేమిరా అన్నారు. ఇతర నాయకుల నోళ్లు కట్టేశారు.
ఇక బెయిలుపై బయటకొచ్చిన అఖిల ప్రియ చంద్రబాబుని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారట. అయితే ఎప్పుడు ఫోన్ చేసినా అపాయింట్ మెంట్ లేదంటూ కబురు వచ్చేదట. ధైర్యం చేసి నేరుగా కలిసే ప్రయత్నం చేస్తే.. చంద్రబాబు మొహం తిప్పుకుంటే పరువుపోతుందనే ఉద్దేశంతోటే అఖిల ప్రియ వెనకడుగేశారని సమాచారం.
అఖిల భర్త ఎక్కడ..?
కిడ్నాప్ కేసులో సహ నిందితుడుగా ఉన్న అఖిల ప్రియ భర్త ఇంకా పరారీలోనే ఉండటం గమనార్హం. ఒక ప్రముఖ వ్యక్తి ఇన్ని రోజులుగా పరారీలో ఉంటే, పోలీసులు ఏం చేస్తున్నారనేదే ప్రశ్న.
ముందస్తు బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్ ని కోర్టు కొట్టేయడంతో ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. బెయిలు వస్తే ఆ తర్వాత తీరిగ్గా లొంగిపోవడానికి భార్గవ్ రామ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
ఇదే విషయంలో చంద్రబాబు సహాయం కోరేందుకు అఖిల ప్రియ ప్రయత్నించారని, అయితే ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని సమాచారం.
ఎంతటి పెద్ద పెద్ద కేసులైనా తనకున్న పరిచయాలతో చిటికెలో ఓ కొలిక్కి తీసుకొచ్చే చంద్రబాబు అఖిలకు మాటసాయం చేసేందుకు మాత్రం వెనకడుగేస్తున్నారు. ఆ కుటుంబంపై ఎందుకో కక్షసాధింపు ధోరణిలో ఉన్నారు. కనీసం మాట్లాడేందుకు సైతం మాజీ మంత్రి అఖిల ప్రియకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదంటే.. చంద్రబాబు మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు.