పుష్ప సీన్-1: అందమైన గోదారి.. చుట్టూ కొండలు.. ఆ చల్లటి గోదారిలో పల్లెటూరి పిల్ల రష్మిక అలా అలా గంతులేస్తుంది.. వెనక నుంచి కొంటెగా బన్నీ ఆమెను చూస్తుంటాడు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అందమైన మెలొడీకి బన్నీ-రష్మిక ఇలా జీవం పోశారు.
పుష్ప సీన్-2: దట్టమైన అటవీ ప్రాంతం.. చేతిలో గొడ్డలితో బన్నీ.. ఇంతలో హఠాత్తుగా పోలీసులు చుట్టుముడతారు. తన అనుచరుల్ని బన్నీ ఆగమని చెబుతాడు. ఓ పోలీస్ లాఠీ ఎత్తుతాడు. దాన్నీ బన్నీ తన చేతితో పట్టుకుంటాడు. కోపంగా పోలీసుల వైపు ఓ లుక్కేస్తాడు.
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి తాజాగా లీక్ అయిన సన్నివేశాలివి. సెట్స్ పైకొచ్చిన మొదటి రోజు నుంచి ఈ సినిమా లీకుల బారిన పడుతూనే ఉంది. తాజాగా ఇలా ఒకేసారి 2 సీన్లు లీక్ అవ్వడం యూనిట్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
పుష్ప సినిమాను ఔట్ డోర్ లో షూట్ చేస్తున్నారు. ఈ కాలం ఔట్ డోర్ షూటింగ్ అంటే లీకులు అపడం ఎవ్వరితరం కాదు. షూటింగ్ కోసం వచ్చిన జనాల్లో ఎవరో ఒకరు తమ మొబైల్ కు పనిచెబుతారు. ఇలా లీకులు వదులుతారు.
సిబ్బంది మొబైల్ వాడకుండా యూనిట్ కంట్రోల్ చేయగలదు కానీ షూటింగ్ కు తరలివచ్చిన జనాల్ని నిలువరించడం యూనిట్ వల్ల కావడం లేదు. అందుకే ఈ లీకుల గోల.
పైన చెప్పుకున్న రెండు క్లిప్పింగులు రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లీక్ వీడియోలు, స్టిల్స్ వైరల్ చేయొద్దంటూ బన్నీ ఫ్యాన్స్ పదేపదే పోస్టులు పెడుతున్నప్పటికీ.. ఈ 2 వీడియోల్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాలేదు.