చంద్రబాబునాయుడితో అమీతుమీకి కోడెల శివరాం సిద్ధమయ్యారు. తన తండ్రి దివంగత కోడెల శివప్రసాద్‌రావు ప్రాతినిథ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్‌ను చంద్రబాబు తనకే ఇస్తారని శివరాం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కోడెల శివరాంపై బాబుకు మంచి అభిప్రాయం లేదు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించారనే ఆగ్రహం చంద్రబాబులో చాలా కాలంగా వుంది.
గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కోడెల శివప్రసాద్‌రావుకు కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ అవమానంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రత్యర్థులు విమర్శించారు. సత్తెనపల్లిలో టీడీపీ వ్యవహారాల్ని శివరాం చూసేవారు. అలాగే ఆయనతో పాటు మరికొందరు కూడా టీడీపీ టికెశ్ ఆశిస్తున్నారు.
వీరెవరినీ కాదని బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా చంద్రబాబు నియమించారు. దీన్ని కోడెల శివరాం జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా అడుగుతున్నా చంద్రబాబునాయుడు కనీసం మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదంటూ శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకుడికి వ్యతిరేకంగా కోడెల పోరాడారో, ఇప్పుడే అదే వ్యక్తికి తన తండ్రి సీటు ఇవ్వడం ఏంటని శివరాం నిలదీస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన గ్రామంలో ఇంటింటికీ కోడెల, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కోడెల ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. తనను ఒంటరివాడిని చేసి చుట్టుముట్టి ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పదవులు, అధికారం కోసం పార్టీలు మారే కుటుంబం తమది కాదని ఆయన అన్నారు. కోడెల శివప్రసాదరావు స్థానంలో మరొకరిని తీసుకొచ్చి, వారి వెంట నడవాలని తనకు సూచించారని అన్నారు. పల్నాటి పులి కోడెలతో నడిచిన తాను పిల్లుల పక్కన నడిచేది లేదంటూ సంచలన వ్యాఖ్య చేశారు. దీంతో చంద్రబాబునాయుడు ఆదేశాల్ని తాను పాటించేది లేదని కోడెల శివరాం తేల్చి చెప్పినట్టైంది.
కన్నా లక్ష్మీనారాయణతో రాజకీయ వైరానికే కోడెల మొగ్గు చూపారు. తన తండ్రితో సుదీర్ఘ కాలం పాటు రాజకీయ శత్రుత్వం నడిపిన కన్నాతో కలిసి పని చేయడానికి కోడెల శివరాం ససేమిరా అనడం టీడీపీకి తలనొప్పిగా తయారైంది. టీడీపీలో వుంటూ పార్టీ నియమావళికి విరుద్ధంగా మాట్లాడుతున్న కోడెల శివరాంపై చర్యలు తీసుకోవడమా? లేక ఆయన్ను పొమ్మనకుండా పొగ పెట్టడమా? అనే చర్చ నడుస్తోంది.