జనసేనాని పవన్‌కల్యాణ్ పర్సనల్ లైఫ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టచ్ చేయడం ఇప్పుడే కొత్త కాదు. అకారణంగా తనను శత్రువుగా లెక్క కట్టి, రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని పవన్‌కల్యాణ్ ప్రయత్నించడంపై వైఎస్ జగన్ తీవ్రంగా రగిలిపోతున్నారు. జనసేనను స్థాపించి 2014లో ఎన్నికల బరిలో దిగకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి, త్రుటిలో జగన్ అధికారాన్ని అడ్డుకున్నానని పవన్ సంతృప్తి చెందారు.
అయితే 2019కి వచ్చే సరికి పవన్ జతగాళ్లు మారిపోయారు. టీడీపీ, బీజేపీకి బదులు వామపక్షాలు, బీఎస్పీ తోడయ్యాయి. చివరికి పవన్‌కల్యాణ్ తాను నిలిచిన రెండు చోట్లా ఓటమి మూటకట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ఏపీలో రాజకీయ సమీక రణలు మారుతున్నాయి. వారాహి యాత్ర అంటూ బయల్దేరిన పవన్‌కల్యాణ్… సీఎం వైఎస్ జగన్, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నోరు పారేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో పవన్ వివాహాలపై సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు.
దీంతో పవన్‌కు చిర్రెత్తుకొచ్చింది. భీమవరం సభలో పవన్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోననని హెచ్చరించారు. హైదరాబాద్‌లో జగన్ ఏమేం చేశాడో చాలా లోతైన విషయాలు తనకు తెలుసని చెప్పుకొచ్చారు. జగన్ తన మనిషిని పంపితే అన్నీ విషయాలు చెబుతానని, అప్పుడు చెవుల నుంచి రక్తం వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
గతంలో పవన్ తమకు వ్యతిరేక రాజకీయాలు చేసిన సందర్భంలో టీడీపీ దారుణంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ప్రచారం చేసింది. 2019 ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా చానళ్లలో ప్రతిరోజూ పవన్ బహు భార్యత్వం, అలాగే పంజాబ్ నటితో సంబంధాలంటూ కత్తి మహేశ్‌తో ఆరోపణలు చేయించడం తెలిసిందే. తన తల్లిపై కూడా ఆరోపణలు చేయిస్తున్నారని, అందుకు నిరసనగా ఫిల్మ్ చాంబర్‌లో హల్‌చల్ చేశారు.
రాజకీయంగా జనసేనను టార్గెట్ చేయాల్సి వస్తే, నాడు టీడీపీ, నేడు వైసీపీకి పవన్ పర్సనల్ లైఫ్ కనిపిస్తోంది. వెంటనే ఆయన మూడు పెళ్లిళ్లు గుర్తుకొస్తున్నాయి. పెళ్లిళ్లు పవన్‌ను ఇరిటేట్ చేస్తున్నాయి. దీంతో కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. దీంతో వ్యవహారం పక్కదారి పడుతోంది. ఇదే వైసీపీ కోరుకుంటోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో టీడీపీ సంబరపడుతోంది.
పవన్‌పై టీడీపీకి ప్రత్యేకంగా ప్రేమ లేదు. పవన్ నమ్మదగిన నాయకుడు కాదనేది టీడీపీ భావన. కేవలం రాజకీయ అవసరాల కోసం పవన్‌పై ప్రేమ ఉన్నట్టు టీడీపీ నటిస్తోంది.
గతంలో తాము పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టే, నేడు వైసీపీ చేస్తుండడం టీడీపీకి సంతోషాన్ని ఇస్తోంది. అందుకే పవన్ పర్సనల్ లైఫ్‌పై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తే, వాటిని ఎల్లో మీడియా హైలెట్ చేయడాన్ని గమనించొచ్చు. తాము కోరుకున్నట్టుగానే పవన్ పెళ్లిళ్లపై జగన్ విరుచుకుపడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. పెళ్లిళ్ల వ్యవహారం ముఖ్యంగా మహిళలలో పవన్‌పై చులకన భావన ఏర్పరుస్తోంది.