ఆయన చెప్పింది కరెక్టే…!

సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు అధికారంలోకి రావడం కోసం ఆచరణకు సాధ్యం కానీ వాగ్దానాలు చేస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలను అమలు చేయలేక నానా తిప్పలు పడుతుంటారు. ఎంత కొమ్ములు తిరిగిన…

సాధారణంగా రాజకీయ పార్టీల అధినేతలు అధికారంలోకి రావడం కోసం ఆచరణకు సాధ్యం కానీ వాగ్దానాలు చేస్తుంటారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వాగ్దానాలను అమలు చేయలేక నానా తిప్పలు పడుతుంటారు. ఎంత కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడికైనా లేదా పార్టీకైనా అది అనుభవమే.

ఇలాంటివి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూ అనుభవమే. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తానన్నారు. కానీ చేతులెత్తేశారు. సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామన్నారు. కానీ అదీ సాధ్యం కాలేదు. ఏ పార్టీ అయినా తాము సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తామంటే నమ్మకూడదు. 

ఉమ్మడి ఏపీలో కొణిజేటి రోశయ్య ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మధ్య నిషేధం సాధ్యం కాదని కుండా బద్దలు కొట్టారు. ఏ రాష్ట్రంలోనైనా మద్యంపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. ఆ ఆదాయం లేకపోతే ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు. అవి అమలు చేయకుంటే ప్రభుత్వాల మనుగడ ఉండదు. ఏపీలో మ‌ద్య నిషేధం సాధ్యం కాద‌ని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. మ‌ద్యాన్ని నిషేధించ‌క‌పోయినా.. మ‌ద్యం ధ‌ర‌ల‌ను మాత్రం త‌గ్గిస్తామ‌న్నారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న ధ‌ర‌ల‌ను రాష్ట్రంలో అమ‌లు చేసే బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్పారు. 

వారాహి యాత్ర‌లో భాగంగా గ‌త ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. మద్య నిషేధం పేరుతో 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్రభుత్వం ప‌క్కాగా మోసం చేసింద‌ని ప‌వ‌న్ విమ‌ర్శంచారు. మద్యం ధరలు బాగా పెంచి, త‌న వారికే డిస్టిల‌రీలు అప్ప‌గించిన ఘ‌న‌త తెలుగు స‌రిగా రాని జ‌గ‌న్‌కే చెల్లుతుంద‌ని చెప్పారు.

రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారని మండిపడ్డారు. పవన్ చెప్పింది వాస్తవమే. మద్యాన్ని నిషేధిండం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇదివరకటి అధికార పార్టీలకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి వైఎస్ జగన్ తెర తీశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నవరత్న పథకాలను అమలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాటిని అమలు చేస్తూ వస్తోన్నారు.

కరోనా వైరస్ వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోన్నారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, పింఛన్ల పెంపు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ-గృహ నిర్మాణం వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తోన్నారు. పింఛన్ల మొత్తాన్ని కూడా పెంచారు. 

గ్రామీణ స్థాయిలో పేద కుటుంబాలను ఆదుకోవడానికి, ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఉద్దేశించిన ఈ నవరత్నాలను చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేస్తోండటం వల్ల ప్రజలు.. జగన్ సర్కార్ వెంటే ఉన్నారు. అనేక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలు సాధించింది. కానీ  సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఒక్కటీ వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొరుకుడు పడట్లేదు. 

ఈ విషయంలో ప్రభుత్వం ముప్పేటదాడిని ఎదుర్కొంటోంది. తెలుగుదేశం పార్టీ- మద్యపాన నిషేధ విషయంలో రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోంది. మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే.. దాన్ని ఎత్తేయాలని, అక్రమంగా సరిహద్దులను మద్యం రాష్ట్రంలోకి ప్రవహిస్తోందంటూ జగన్ సర్కార్‌పై ధ్వజమెత్తుతోంది. మద్యం ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలను పరిమితం చేయడం, వాటి రేట్లను మూడు-నాలుగు రెట్లు పెంచడం ప్రజల్లో కొంత వ్యతిరేకత సైతం ఎదురైందనేది వైసీపీ నేతల అభిప్రాయం. 

ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లను అమ్మకానికి పెట్టడం కూడా దీనికి కారణమైంది. చీప్ లిక్కర్ రేటు పెంచడం  మందుబాబులు జీర్ణించుకోలేకపోతున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ పరిణామాలు జగన్ సర్కార్‌కు కొంత పంటి కింద రాయిలా తయారయ్యాయి. అందుకే- మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంది జగన్ సర్కార్. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ నుంచి వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. 

మద్యం ధరల రేట్లను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించింది ప్రభుత్వం. వాటి రేట్లను సవరించింది. మద్యం ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వెంటనే మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. మద్యం ప్రీమియం బ్రాండ్లను కూడా అమ్మకానికి పెట్టింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన అన్ని రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయానికి తీసుకొచ్చింది. బార్లు, వాక్ ఇన్ స్టోర్లలోనూ ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచింది. ప్రీమియం బ్రాండ్ల విక్రయాలకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. 

తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి ప్రముఖ బ్రాండ్లు రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రీమియం బ్రాండ్ల అమ్మకం వల్ల కొంత వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తోంది.