తెలంగాణ వామపక్ష పార్టీలకు దిక్కు తోచడం లేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలు పోటీచేసే అవకాశం ఉంటుందో లేదో వారు నిర్ణయించుకోలేకపోతున్నారు. కేవలం పోటీకి మాత్రమే పరిమితం కావాలా? సీట్లు గెలిచే యోగం ఈసారైనా ఉంటుందా? అనే మీమాంస పార్టీలలో నడుస్తోంది.
అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితితో కలిసి వెళితేనే ఎడ్వాంటేజీ ఉంటుందని.. తమ పార్టీలకు ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయనేది వారి ఆశ. అయితే.. కేసీఆర్ వారిని దగ్గరకు రానివ్వడం లేదు. ఈ నేపథ్యంలో తాము ప్రస్తుతానికి భారాసతోనే పొత్తుల్లో ఉన్నాం అని, పొత్తులు వీగిపోయినట్లుగా కేసీఆర్ ప్రకటించకపోవడమే అందుకు కారణం అని వారు చెప్పుకుంటున్నారు.
ఇంతకూ భారాస- వామపక్షాల మధ్య పొత్తు ఎప్పుడు కుదిరింది? కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా కారణంగా వచ్చిన మునుగోడు ఉపఎన్నిక సమయంలో.. బిజెపికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ వామపక్షాల సాయం తీసుకున్నారు. అప్పటికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కొత్త కూటమిని తానే తెరపైకి తెచ్చి చక్రం తిప్పగలననే విశ్వాసంతో ఉన్నారు. ఆ సమయంలో భారాస ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వామపక్ష నేతలను కూడా పక్కన పెట్టుకుని మునుగోడు సభలో మాట్లాడిన కేసీఆర్.. వారితో ఆ స్నేహబంధం మునుగోడుతో ముగిసిపోయేది కాదని, అసెంబ్లీ ఎన్నికల్లోను, పార్లమెంటు ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతుందని వెల్లడించారు.
అప్పటినుంచి వామపక్ష నాయకుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కాసిని సీట్లు తమకు ఇవ్వకపోతారా? ఈసారి అయినా అసెంబ్లీలో అడుగుపెట్టకపోతామా? అనే కోరిక ప్రబలుతోంది. కానీ, కేసీఆర్, మునుగోడు గెలుపు తర్వాత వామపక్ష నేతలను దగ్గరకు రానివ్వలేదు. ఈలోగా జాతీయ రాజకీయాల్లో కూటమి సమీకరణలు మారుతూ వచ్చాయి.
కాంగ్రెస్ కూడా లేని విపక్ష కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్ విఫలప్రయత్నం చేయగా.. మోడీని గద్దెదించగల విపక్ష కూటమికి కాంగ్రెస్ మాత్రమే సారథ్యం వహించగలదనే నమ్మకంతో వామపక్షాలు ఆ జట్టులో చేరి కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ జెండా మోస్తుండగా.. లోకల్ గా తెలంగాణలో వారిని ఆదరించడానికి ఇప్పుడు కూడా కేసీఆర్ సిద్ధంగానే ఉన్నారా అనేది అనుమానమే. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో వారికి సీట్లు కేటాయించినంత మాత్రాన, పార్లమెంటు ఎన్నికల సమయానికి వారు జాతీయ పార్టీ సూచనలను కాదని, తెలంగాణలో భారాసకు మద్దతు ఇస్తారా? అనే అనుమానం కూడా కేసీఆర్ లో ఉంది. అందుకే ఆయన వారిని దూరం పెడుతున్నారనే విశ్లేషణలున్నాయి.
భారాసతో పొత్తు కుదరకపోతే గనుక.. కాంగ్రెస్ తో కలిసి వెళ్లేది లేదని లెఫ్ట్ కు బలం ఉన్న చోట్ల మాత్రమే పోటీచేస్తామని తమ్మినేని వీరభద్రం తదితరులు వెల్లడించడం గమనార్హం.