ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు కొదవలేదు. ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు కామన్ గా అందరికీ ఒక సెంటిమెంట్ పట్టుకుంది. ఆ సెంటిమెంట్ పేరు సిద్ శ్రీరామ్. దాని ఖరీదు 6 లక్షలు.
అవును.. సినిమాలో సిద్ శ్రీరామ్ పాట ఉంటే మైలేజీ గ్యారెంటీ అని అంతా భావిస్తున్న రోజులివి. దాని కోసం అతడికి ఒక్క సాంగ్ కోసం 6 లక్షల రూపాయలు చెల్లించడానికి కూడా వెనకాడ్డం లేదు. చివరికి జీఎస్టీని కూడా నిర్మాతే భరించి మరి “సిద్ సెంటిమెంట్” ను కొనసాగిస్తున్న రోజులివి.
అయితే సెంటిమెంట్ ప్రకారం, సిద్ పాడిన ప్రతి పాట హిట్ అయిపోతోందా? సినిమాకు ఎనలేని మైలేజీ తెచ్చిపెడుతుందా? దీనికి మాత్రం వందశాతం అవునని సమాధానం చెప్పలేం. మంచి ట్యూన్ కు సిద్ గాత్రం తోడైనప్పుడు మాత్రమే ఆ పాట వైరల్ అవుతుంది. లేకపోతే సోదిలో కలిసిపోతుంది. రీసెంట్ గా అలాంటి పాట ఒకటి వచ్చింది కూడా.
ఈ విషయాన్ని మాత్రం చాలామంది మేకర్స్ గ్రహించడం లేదు. మ్యూజిక్ డైరక్టర్ కు ఇచ్చే బడ్జెట్ లోనే 'సిద్ పాట మస్ట్' అనే కండిషన్ పెట్టి మరీ పేమెంట్ ఇస్తున్నారు. దీంతో చిన్న కంపోజర్స్ చితికిపోతున్నారు. సిద్ తో పాటు మిగతా పేమెంట్స్ పోగా, తమకు ఏం మిగలడం లేదని వాపోతున్నారు.
ఇదొక కోణం అనుకుంటే.. ఈ 'ఆయింట్ మెంట్'లో మరో కోణం ఉంది. ఎలాగైనా తమ సినిమాలో సిద్ శ్రీరామ్ ను ఇరికించాలనే ప్రయత్నం అది. రౌద్ర రసాన్ని అలవోకగా ఒలికిస్తూ, వరుస పెట్టి సినిమాలు చేసే ఓ సీనియర్ హీరో కూడా ఈ మధ్య సిద్ ను పెట్టేయండి అంటూ హుకుం జారీచేశాడు.
సదరు హీరో బాడీ లాంగ్వేజ్ కు, అతడి సినిమాలకు సిద్ పాటలు పనికిరావనే విషయాన్ని పదో తరగతి పిల్లాడు కూడా చెబుతాడు. ఈ విషయాన్ని హీరోకు నచ్చజెప్పడానికి ఆ దర్శకుడికి తలప్రాణం తోకకొచ్చింది.