జడ్జిమెంట్ కింగ్ అన్నారు.. అల్లు బాబి సత్తా ఇంతేనా!

“గని సినిమా మీద పెద్ద పెద్ద సినిమాలు పోటీగా ఉన్నాయని తెలుసు. అయినా కూడా గనిని వదులుతున్నామంటే మా నమ్మకాన్ని అర్థం చేసుకోండి. – అల్లు అరవింద్” Advertisement “నా సినిమాల వెనక బాబి…

“గని సినిమా మీద పెద్ద పెద్ద సినిమాలు పోటీగా ఉన్నాయని తెలుసు. అయినా కూడా గనిని వదులుతున్నామంటే మా నమ్మకాన్ని అర్థం చేసుకోండి. – అల్లు అరవింద్”

“నా సినిమాల వెనక బాబి హోం వర్క్ చాలా ఉంది. నా ప్రతి సినిమా కథ వెనక అన్నయ్య ఉన్నాడు. అతడికి 20 ఏళ్ల అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి ఓ కథ ఎంచుకొని నిర్మాతగా మారాడంటే ఆ సినిమా కచ్చితంగా బాగుంటుంది. – బన్నీ”

గని సినిమాతో నిర్మాతగా మారిన అల్లు బాబికి.. అతడి తండ్రి, తమ్ముడు మూవీ రిలీజ్ కు ముందు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఇవి. దీంతో వరుణ్ తేజ్ సినిమాగా కంటే, బాబి సినిమాగా ఇది మారిపోయింది. అల్లు బాబి తన అనుభవం మొత్తం రంగరించి గని సినిమా తీశాడని ప్రేక్షకులు భావించారు. తన 20 ఏళ్ల అనుభవాల గని నుంచి ఈ 'గని'ని తీసి ఉంటాడని అనుకున్నారు. కట్ చేస్తే, ఆ అనుభవం ఏదీ గనిలో కనిపించలేదు.

గని సినిమా విడుదలైంది. తొలి వారాంతం పూర్తి చేసుకుంది. బాబి జడ్జిమెంట్ తప్పు అని నిరూపించింది. సగటు స్పోర్ట్స్ డ్రామాగా రొటీన్ అనిపించింది తప్ప, ఇందులో అల్లు బాబి మార్క్ మాత్రం కనిపించలేదు. ఈ కంటెంట్ తో నిర్మాతగా మారాలని బాబికి ఎందుకు అనిపించిందో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకే తెలియాలి.

ఓ కథను బన్నీకి వినిపించాలంటే బాబిని దాటి వెళ్లాలంటారు. బాబి కూడా గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకున్నాడు. బాబిని మెప్పించిన తర్వాతే, ఓ కథ అరవింద్ దగ్గరకు, ఆ తర్వాత బన్నీ దగ్గరకు వెళ్తుందంటారు. మరి అంతటి జడ్జిమెంట్ ఉన్న బాబి, తన తొలి సినిమా విషయంలో ఎందుకు తప్పటడుగు వేశాడు. ష్యూర్ షాట్ హిట్ ఎందుకు కొట్టలేకపోయాడు.

ఈ విషయంలో బాబిని తప్పుపట్టడానికేం లేదు. ఎంత తెలివైనవాడైనా ఆడియన్స్ ఇచ్చే తీర్పును ముందే గెస్ చేయలేడు. కథల విషయంలో జడ్జిమెంట్ కింగ్ అనిపించుకున్న బాబి కూడా, ప్రేక్షకుల జడ్జిమెంట్ కు తలొగ్గాల్సిందే. గని విషయంలో అదే జరిగింది. తదుపరి చిత్రం విషయంలోనైనా బాబి జడ్జిమెంట్ నిజం అవ్వాలని కోరుకుందాం.