శ్రియ, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు మాతృత్వాన్ని ఆనందిస్తున్నారు. త్వరలోనే కాజల్, సోనమ్ కపూర్ కూడా పండంటి బిడ్డలకు జన్మనివ్వబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. హీరోయిన్ ప్రణీత తల్లికానుంది. తను గర్భం దాల్చిన విషయాన్ని ప్రణీత్ స్వయంగా వెల్లడించింది.
తన భర్త 34వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా, దేవతల నుంచి తాము అద్భుతమైన బహుమతి అందుకున్నామంటూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా భర్తను ఓ చేత్తో కౌగిలించుకుంటూ, మరో చేత్తో తన స్కానింగ్ రిపోర్ట్ ను పట్టుకొని దిగిన ఫొటోల్ని పోస్ట్ చేసింది ప్రణీత.
లాక్ డౌన్ టైమ్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత. గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె వివాహం చేసుకుంది. నితిన్ రాజు ఫామ్ హౌజ్ లో కేవలం 10 మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ పెళ్లి సింపుల్ గా జరిగింది.
ఎవ్వరికీ చెప్పాపెట్టకుండా, సీక్రెట్ గా ఇలా పెళ్లి చేసుకోవడంపై ప్రణీత అప్పట్లో క్షమాపణలు కూడా కోరింది. కరోనా పరిస్థితుల వల్ల తమ పెళ్లికి అనుమతి వస్తుందా రాదా అనే సందిగ్దతలో కుటుంబ సభ్యులమంతా ఉండిపోయామని, అలా హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.
అలా నితిన్ రాజును పెళ్లాడిన ప్రణీత, ఏడాది తిరగకుండానే గర్భందాల్చింది. ఓ వైపు పెళ్లి చేసుకున్నప్పటికీ, మరోవైపు సినిమాలు కూడా కొనసాగిస్తోంది ఈ హీరోయిన్. పెళ్లి తర్వాత బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కరోనా టైమ్ లో ప్రణీత చేసిన ఛారిటీ కార్యక్రమాలకు అందరి నుంచి ప్రసంశలు దక్కాయి.