ముప్పై వేల మెజారిటీ…మంత్రి పదవి ఇవ్వరా…?

అవును. రాజకీయాల్లో చెప్పుకుంటే అన్నీ అర్హతలే. అనుకూలంగా చేసుకోవాలంటే ప్రతీ పాయింట్ ని తమ వైపు పాజిటివ్ గా చూపించుకోవచ్చు. అలాగే అవతల పక్షల వారికి కూడా వారి ఆలోచనలు వారికి ఉంటాయి కదా. ఏది…

అవును. రాజకీయాల్లో చెప్పుకుంటే అన్నీ అర్హతలే. అనుకూలంగా చేసుకోవాలంటే ప్రతీ పాయింట్ ని తమ వైపు పాజిటివ్ గా చూపించుకోవచ్చు. అలాగే అవతల పక్షల వారికి కూడా వారి ఆలోచనలు వారికి ఉంటాయి కదా. ఏది ఏమైనా ఇపుడు ఒక పెద్ద ప్రశ్ననే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అనుచరులు లేవనెత్తారు.

అనకాపల్లి జిల్లా వరకూ తీసుకుంటే 2019 ఎన్నికల్లో ధర్మశ్రీకి ఏకంగా 30 వేల పై చిలుకు మెజారిటీ దక్కింది. అది భారీగానే చూడాలి. పైగా టీడీపీకి కంచుకోట లాంటి చోట ఆ మెజారిటీ రావడమే ఇపుడు ధర్మశ్రీ వర్గీయులు ప్లస్ పాయింట్ గా చూపుతున్నారు. అలాగే సీనియారిటీ పరంగా చూస్తే ధర్మశ్రీ 2004లోనే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. అంటే గుడివాడ అమరనాధ్, బూడి ముత్యాలనాయుడు కంటే ఆయన ముందు అసెంబ్లీలో ఉన్నారన్న మాట.

బలమైన సామాజికవర్గం ఉంది. మాటకారిగా పేరుంది. జిల్లాలో పలుకుబడి ఉంది. అన్నీ ఉన్నా రేసులో ఉన్నా మంత్రి వర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు అన్నదే ధర్మశ్రీ వర్గీయుల బాధగా ఉందిట. ఇక తమ కంటే బాగా జూనియర్ అయిన కేవలం 2019 ఎన్నికల్లోనే ఫస్ట్ టైమ్ గెలిచిన గుడివాడకు తమ సామాజికవర్గం కోటాలో మంత్రిని చేసి ధర్మశ్రీని చిన్నబుచ్చారు అన్నది వారి వాదన.

అందుకే రోడ్ల మీదకు వచ్చి మరీ అర్ధరాత్రి నిరసనలు తెలియచేశారు. నాలుగు మండలాలకు చెందిన వారంతా పదవులకు రాజీనామాలు చేస్తామంటున్నారు. మరి ధర్మశ్రీ అనుచరులది ధర్మమైన వాదన అనుకున్నా హై కమాండ్ వైపు నుంచి వాదనలు ఉంటాయి కదా. వారు కూడా అన్నీ ఆలోచించే కదా మంత్రులను ఎంపిక చేస్తారు. మొత్తానికి ధర్మశ్రీ ధర్మాగ్రహానికి జవాబు చెప్పాలి, దాన్ని చల్లార్చాలి. ఏం జరుగుతుందో చూడాలి.