1963లో తమిళనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కామరాజ్‌కి ఒక ఐడియా వచ్చింది. దాన్నే కామరాజ్ ప్లాన్ అంటారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సీనియర్ మంత్రులు , ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి.
అనుకున్నట్టుగానే గాంధీ జయంతి రోజు ఆరుగురు సీనియర్ కేంద్రమంత్రులు , ఆరుగురు ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి. చేసిన వారిలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, మొరార్జీ, జగ్జీవన్‌రామ్ లాంటి ఉద్ధండులతో పాటు కామరాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత కామరాజ్ సలహా మేరకు శాస్త్రి మళ్లీ మంత్రివర్గంలో చేరాడు.
పరిణామాలు ఎలా వున్నా భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రయోగం మళ్లీ జరగలేదు. ఎన్టీఆర్ హయాంలో మొత్తం మంత్రులందరినీ మార్చారు కానీ, వాళ్లకి పార్టీ బాధ్యతలు అప్పగించలేదు.
అయితే జగన్ తొలిరోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానని అన్నారు. ఈ మధ్య రాజీనామాలు తీసుకుని సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వస్తే రాజకీయ పరిశీలకులందరికీ కామరాజ్ పథకమే గుర్తుకొచ్చింది. దీని వల్ల పార్టీలో కొందరికే పర్మినెంట్‌గా మంత్రి పదవులు వస్తాయనే అపోహ వుండదు.
సీనియర్లు తమ అనుభవంతో పార్టీ సంస్థాగత లోపాలను చక్కదిద్ది ఎన్నికలకి సిద్ధం చేస్తారు. కష్టపడే వాడికి ఎలాంటి సిఫార్సులు లేకుండా పదవులు వస్తాయనే నమ్మకం ఎమ్మెల్యేలలో ఏర్పడేది.
అయితే జగన్ పాత వాళ్లని 10 మందిని కొనసాగించాలనే నిర్ణయం వల్ల ఒత్తిడులకు లొంగారనే విమర్శలకి ఆస్కారం ఇచ్చారు. జగన్ భయపడుతున్నాడని కూడా ప్రత్యర్థులు ఎత్తుకున్నారు.
ఏమైనా కానీ పార్టీలో ఒక కొత్త సంస్కృతిని ప్రవేశ పెట్టే అవకాశాన్ని జగన్ కోల్పోయాడు.
-జీఆర్ మహర్షి