మంత్రి పదవి చేతికి వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆవేదన వర్ణనాతీరం. కొత్త కేబినెట్ కూర్పులో ట్విస్ట్. ఆఖరి క్షణంలో మంత్రివర్గంలో తాజా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు చోటు దక్కింది. ముందు వెలువడిన జాబితాలో ఆదిమూలపు సురేష్ పేరు లేదు.
ఆయన స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా నుంచి తిప్పేస్వామి చోటు దక్కించుకున్నారు. ఆదిమూలపు సురేష్‌ను కొనసాగిస్తానని జగన్ చెప్పడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఒకే జిల్లాకు చెందిన ఇద్దరిలో ఒకరిని కొనసాగించి, మరొకరిని తొలగిస్తే చెడు సంకేతాలు వెళ్తాయని జగన్‌తో బాలినేని అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తొలగించినా, కొనసాగించినా ఇద్దరి విషయంలో ఒకే న్యాయం చేయాలనేది బాలినేని డిమాండ్. ఈ నేపథ్యంలో మొదట వెలు వడిన కేబినెట్ జాబితాలో బాలినేని, ఆదిమూలపు సురేష్ పేర్లు కనిపించకపోవడంతో …ఇద్దరినీ పక్కన పెట్టినట్టు భావించారు. ఆ తర్వాత కొంత సేపటికే అనూహ్యంగా తిప్పేస్వామి పేరు తప్పించి ఆదిమూలపు సురేష్ పేరు జాబితాలో చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది.
జాబితా కూర్పులో చోటు చేసుకున్న పొరపాటుగా ప్రభుత్వ పెద్దలు చెప్పడం గమనార్హం. ఏది ఏమైతేనేం బాలినేని అభ్యంతరాల్ని జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదు. తాను అనుకున్నట్టుగానే ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు.
బాలినేని అసంతృప్తిని పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన పేరు ప్రకటించి, మళ్లీ పక్కన పెట్టడంపై తిప్పేస్వామి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.