నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పూజలు ఎట్టకేలకు మంత్రి పదవి తెచ్చి పెట్టాయి. మంత్రి పదవి కోసం ఆమె తిరగని గుడి లేదు, పూజించని దేవుళ్లు లేరు. తిరరుమల వెంకన్న, విజయవాడ దుర్గమ్మ, జొన్నవాడ కామాక్షమ్మ, శ్రీకాళహస్తీశ్వరుడు, శ్రీశైలం మల్లికార్జునుడు, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలన్నీ సందర్శించారు. యజ్ఞాలు చేశారు. సంబంధిత ఆలయాల్లోని ప్రధాన పూజలన్నీ చేశారు.
గత కొన్ని రోజులుగా ఇంటిని వదిలేసి, ఆలయాలే నివాసాలుగా చేసుకున్న వైనం ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరిచింది. కొత్త కేబినెట్ తెరపైకి రానున్న నేపథ్యంలో, అందులో తనకు అవకాశం దక్కాలని, దేవుళ్లారా మీరే దిక్కు, నా మొర ఆలకించాలని రోజా చేసుకున్న విజ్ఞప్తులు, వేడుకోలు ఎట్టకేలకు ఫలించాయి. సోమవారం కొలువుదీరనున్న కొత్త కేబినెట్‌లో రోజాకు చోటు దక్కడం విశేషం.
సామాజిక సమీకరణల రీత్యా చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరిగి కేబినెట్‌లో కొనసాగించనున్నారనే వార్తలు పొక్కడంతో, రోజాకు అవకాశాలు సన్నగిల్లాయనే ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డి, రోజాలకు అవకాశం ఇవ్వడం కష్టమని అంతా భావించారు.
ఇదే కాకుండా రోజా, పెద్దిరెద్ది మధ్య విభేదాలు కూడా …ఆమెకు పదవి రాకుండా చేస్తాయనే ఆందోళన నగరి వైసీపీ శ్రేణుల్లో లేకపోలేదు. అయితే కొత్త కేబినెట్‌లో ఎట్టకేలకు రోజా బెర్త్ దక్కించుకోవడం ఒకింత ఆశ్చర్యమే. అంతా దేవుని దయ అని నగరి వైసీపీ శ్రేణులు అంటుండం విశేషం.